వదిన అంటే ఇంత మంచిగా ఉంటుందా.. ఫిదాలో కట్టిపడేసిన శరణ్య
ఫిదా సినిమాలో దర్శకుడు శేఖర్ కమ్ముల చెక్కిన మరో కమనీయ శిల్పం వదిన. అదే సాయి పల్లవి అక్క, వరుణ్ తేజ్ వదిన. తెలుగు సినిమాల్లో ఎప్పుడో సావిత్రి నటించి చూపిన వదిన పాత్రను మన కళ్లముందు మరోసారి అలా నిలిపి చ
దిల్ రాజు చెప్పినట్లుగా ఫిదా సినిమా పవన్ కల్యాణ్ తొలిప్రేమ, అల్లు అర్జున్ ఆర్య సినిమాల స్థాయిలో ప్రేమకు సంబందించిన నూతనభావాన్ని పలికించి ప్రేక్షకులను ఒప్పించడంలో అఖండ విజయం సాధిస్తోంది. చిత్రం పొడవునా మంచితనంతో, మృదువైఖరితో చంపేసే వరుణ్ తేజ్, అడపిల్లను కాదు అగ్గిపుల్లను అంటూ తెలంగాణ యాసలో చిరస్మరణీయ పాత్రను పోషించి మరో సావిత్రిని తలపించిన సాయి పల్లవి, కూతుళ్లపట్ల అంతులేని ప్రేమను కళ్లతో పలికించి కన్నీరు పెట్టించిన సాయిచంద్ ఇలా ఫిదా సినిమాలో ఏ పాత్ర తీసుకున్నా మనుషుల్లోని మంచితనానికి మారుపేర్లుగామారి ప్రేక్షకుల అభిమానాన్ని కొల్గగొడుతున్నాయి.
ఫిదా సినిమాలో దర్శకుడు శేఖర్ కమ్ముల చెక్కిన మరో కమనీయ శిల్పం వదిన. అదే సాయి పల్లవి అక్క, వరుణ్ తేజ్ వదిన. తెలుగు సినిమాల్లో ఎప్పుడో సావిత్రి నటించి చూపిన వదిన పాత్రను మన కళ్లముందు మరోసారి అలా నిలిపి చూపిన శరణ్య తెలుగు సమాజంలో, కుటుంబ జీవితంలో వదిన పాత్రకున్న మరో మాతృమూర్తి రూపాన్ని అలా తెరపై చూపించి వదిలింది. ఈరోజు సాయిపల్లవి, వరుణ్ తేజ్, సాయిచంద్ వంటి వారిని ఫిదా సినిమాలో ఎలా తల్చుకుంటున్నారో.. అంతే స్థాయిలో వరుణ్ వదినను జనం తమ గుండెల్లో పదిలంగా దాచుకుంటున్నారు.
నిజంగా వదిన ఇంత గొప్పగా, బయటినుంచి వచ్చిన మరో అమ్మగా జీవితంలో ఉంటుందా, అలా ఉంటే ఎంత బాగుండు అనే కమ్మటి భావాన్ని సినిమా మొత్తంలో అలా పరిచేసి చూపింది శరణ్య. భావోద్వేగాలు పండించాల్సిన చోట కొన్ని సన్నివేశాల్లో నటించడానికి తానెంత కష్టపడిందీ ఒక ఇంటర్వూలో శరణ్య చెప్పింది. తాను పెళ్లై అమెరికాకు వెళ్లడానికి ప్యాక్ చేసుకుంటున్న సందర్భంలో ఉద్వేగాన్ని పలికించలేక ఇబ్బంది పడుతుంటే దర్శకుడు, కో దర్శకుడు పదే పదే తనను ప్రోత్సహించి బాగా నటించేలా చేశారన్నది శరణ్య.
ఇదంతా ఒక ఎత్తయితే.. మరిది అయిన వరుణ్‌ను తన సొంత బిడ్డలాగా చూస్తూ అమ్మతనాన్ని చూపించడంలో శరణ్య శిఖర స్థాయి నటనను ప్రదర్సించింది. ముఖ్యంగా సాయి పల్లవి తన ప్రేమను పదే పదే తిరస్కరిస్తూ వచ్చినప్పుడు పిద్చెక్కుతున్న వరుణ్‌ను ఓదార్చడంలో శరణ్య ప్రదర్శించిన మాతృభావన సినిమా చూస్తున్న ప్రేక్షకులను కదిలించివేసింది. మరిది బాధను పంచుకుంటున్న క్రమంలో సొంతచెల్లెలు పల్లవిని కూడా పక్కన పెట్టేసిన దృశ్యంలో శరణ్య చూపించిన హావభావాలు చాలా కాలం మన జ్ఞాపకాల్లో కదలాడుతుంటాయి. తన పాత్ర పరిధిలో చూపించాల్సిన మార్దవాన్ని, మృదుత్వాన్ని, వదిన తల్లిగా ఒదగిపోవాలనే భారతీయ విధేయగుణాన్ని ప్రదర్శించడంలో సింగిల్ పాయింటులో కూడా మరక లేని నటనను శరణ్య ప్రతి దృశ్యంలో చూపించింది.
ఒక ఇంటర్వ్యూలో ఆమెను యాంకర్ ఇదే విషయంపై ప్రశ్నిస్తూ. మరిదితో సీన్లను ఎలా పండించారు. ఏ ప్రేరణతో అంత చక్కటి నటనను చూపించారు అంటూ అడిగినప్పుడు శరణ్య తన వ్యక్తిగత జీవితంలోకి వెళ్లిపోయింది. కుటుంబంలో తనకూ ఇప్పుడు ఒక మరిది ఉన్నాడని, ప్రతి రోజూ తనతో కలిసి అల్లరి చేస్తూ, డ్యాన్స్ చేస్తూ ఎంతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటున్నానని. ఆ సాన్నిహిత్యమే తనకు ఫిదా సినిమాలో సహాయపడిందని శరణ్య చెప్పింది.
దాదాపు పాతికేళ్ల క్రితం హమ్ అప్‌కే కౌన్ హై చిత్రంలో సల్మాన్ ఖాన్ వదినగా కోట్లమంది హృదయాలను కొల్లగొట్టిన రేణుకా సహానిని మరోసారి గుర్తు తెచ్చింది శరణ్య. కొన్ని సన్నివేశాల్లో రేణుకా సహాని కంటే శరణ్యే వదిన పాత్రను శక్తివంతంగా పోషించిందనిపిస్తుంది. సమాజ జీవితంలో కుటుంబంలో వదిన అలా ఒదిగిపోవడం, మరిదిని కన్నబిడ్డలాగా భావించడం, మాతృప్రేమను కొత్త రూపంలో ప్రదర్శించడం ఫిదా సినిమా స్థాయిలో ఉంటుందో లేదో తెలియదు కానీ.. శేఖర్ కమ్ముల చెక్కిన వదిన పాత్ర చందమామ కథలను తలపించే మనోహర మూర్తిమత్వాన్ని అలా మన కళ్లముందు నిలిపింది.
ఫిదా సినిమాలో వదిన పాత్ర పోషించిన శరణ్యకు, అంత సజీవంగా ఆ పాత్రను చెక్కిన శేఖర్ కమ్ములకు తెలుగు సమాజం నిండు హృదయ నీరాజనాలు అర్పించాల్సిందే.