గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 మార్చి 2024 (16:10 IST)

షాహిద్ కపూర్ తో అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్ చిత్రం

Shahid Kapoor - Ashwatthama
Shahid Kapoor - Ashwatthama
మన పురాణాల్లోని అద్భుతమైన పాత్రను ఈ ఆధునిక యుగానికి పరిచయం చేసేందుకు, థ్రిల్లింగ్ జర్నీని ప్రేక్షకులను ఇచ్చేందుకు పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా.. ఈ మాగ్నమ్ ఓపస్‌ను సచిన్ రవి తెరకెక్కిస్తున్నారు. ఊహకు, వాస్తవాలకు మధ్య ఉండే అద్భుతమైన కథను, గాధను 'అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్' చూపించబోతోన్నారు. ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’ అనే ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ ఇలా ఐదు భాషల్లో రానుంది.
 
ఈ చిత్రం మహాభారతంలోని చిరంజీవి అయిన ఓ యోధుడు (అశ్వత్థామ) కథను చెప్పబోతోంది. ఇప్పటికీ అశ్వత్థామ బతికే ఉన్నారని నమ్ముతుంటారు. వేగవంతమైన సాంకేతిక పురోగతులు, అద్భుతమైన సామర్థ్యాలతో పరిగెడుతున్న ఈ ప్రస్తుత యుగంలో, అశ్వత్థామ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు అనేది చూపించబోతోన్నారు. హై యాక్షన్ ప్యాక్డ్ సీన్లతో సినిమాను అద్భుతంగా తీర్చి దిద్దబోతోన్నారు. అమర జీవిగా ఇన్ని వేల సంవత్సరాలు ఎలా బతికి ఉన్నాడు అనే పాయింట్‌ను కూడా చూపించబోతోన్నారు.
 
ఇది గతం, వర్తమానం మధ్య జరిగే యుద్దం అని చెప్పుకొచ్చారు. ఈ సీన్లు రోమాలు నిక్కబొడుచుకునేలా తెరకెక్కిస్తామని చెబుతున్నారు. నిర్మాత జాకీ భగ్నాని మాట్లాడుతూ.. “మేము చేపట్టే ప్రతి ప్రాజెక్ట్ కేవలం వినోదం మాత్రమే కాదు.. ప్రేక్షకులకు మరిచిపోలేని ఓ అద్భుతమైన అనుభవాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తాం. ప్రేక్షకుల హృదయాలు, మనస్సులపై శాశ్వత ప్రభావాన్ని చూపించేలా ఉండాలని చూస్తాం. బడే మియా చోటే మియా తర్వాత, నేను ఊహించని సినిమా చేయాలనుకున్నాను.  ఇది మనందరికీ తెలిసిన కథ. ఈ కథపై ప్రస్తుత ఆధునిక కాల పరిస్థితులు, వాటి వల్ల ఆ లెజెండ్ చేయాల్సి వచ్చిన యుద్దం ఏంటన్నది ప్రేక్షకులు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది’ అని అన్నారు.
 
దర్శకుడు సచిన్ రవి మాట్లాడుతూ.. “నాకు అమరత్వం అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇందులో చాలా భావోద్వేగాలు, నాటకీయ దృశ్యాలను రేకెత్తించే ఆస్కారం ఉంటుంది. మహాభారతంలోని అశ్వత్థామ ఈనాటికీ జీవిస్తున్నాడని నమ్ముతుంటారు. అతను అమరజీవి అని భావిస్తుంటాం. అతని కథనాన్ని లోతుగా పరిశోధించాలనే నా కోరికకు ఆజ్యం పోసింది. నా లక్ష్యం ఈ కథకు ప్రాణం పోసి, ప్రస్తుత కాలక్రమంలో అతనిని ఉంచడం.. అమర జీవి యొక్క సంక్లిష్టమైన మనస్తత్వం ఎలా ప్రభావితం అవుతుంది.. అతను వేల సంవత్సరాలుగా చూసిన ప్రపంచాన్ని అతను ఎలా గ్రహించాడో అన్వేషించడం అనే పాయింట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. నేను అతని కథను భారీ ఎత్తున, మునుపెన్నడూ చూడని యాక్షన్ చిత్రంగా మల్చాలని ప్రయత్నిస్తున్నాను’ అని అన్నారు.
 
పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌లు నిర్మించారు. సచిన్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే థియేటర్‌లలో విడుదల కానుంది.