శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (17:29 IST)

శర్వానంద్ ఒకేఒక జీవితం' సెప్టెంబర్‌లో విడుద‌ల‌

Sharwanand
Sharwanand
విభిన్నమైన కథలు అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే వుంటాయి. అలాంటి అరుదైన, విభిన్నమైన కథాంశాలతో అభిమానులను ఎప్పుడూ అలరించే సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థలో విడుదల కాబోతున్న తాజా చిత్రం 'ఒకేఒక జీవితం'. ఇప్పటికే ఈ సినిమా టీజర్, అమ్మ పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందాయి.
 
నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమల అక్కినేని, శర్వానంద్, నాజర్, రీతూ వర్మ, ప్రియదర్శి పులికొండ, వెన్నెల కిషోర్, అలీ తదితర భారీ తారాగణం వుంది. చిత్రానికి సుజిత్ సారంగ్ కెమెరాను అందించగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీజిత్ సారంగ్ ఎడిటర్ గా , సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో  తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్, అమల అక్కినేని, నాజర్, రీతూ వర్మ రెండు భాషల్లోనూ తమ పాత్రలని పోషించారు.
 
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్ కావడంతో  వీఎఫ్ఎక్స్  సన్నివేశాలు అద్భుతంగా చూపించడానికి చిత్ర యూనిట్ ప్రత్యేక ద్రుష్టి పెట్టింది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రం తమిళంలో 'కణం' పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందు మరిన్ని సర్ ప్రైజ్ ప్రకటనలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
 
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ. అరువి, తీరన్ అధిగారమ్ ఒండ్రు (ఖాకీ), ఖైదీ, సుల్తాన్ మొదలైన వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న ఈ సంస్థ ఎల్లప్పుడూ విభిన్నమైన అంశాలతో చిత్రాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. 'ఒకేఒక జీవితం'తో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి అడుగు వేస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గ చిత్రాలు అందించగలమని నిర్మాతలు విశ్వాసం వ్యక్తం చేశారు.