సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (21:57 IST)

నా హత్యకు స్కెచ్ వేశారు.. సీఎం కేసీఆర్ సపోర్టు చేశారు : ప్రకాష్ రాజ్

'బొమ్మరిల్లు' ఫేం ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు కొందరు స్కెచ్ వేశారని చెప్పారు. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఎంతో ఆండగా నిలబడ్డారని గుర్తుచేశారు. పూర్తి బందోబస్తు కల్పించి, ఎంతో ధైర్యం చెప్పారని ఆయన తెలిపారు. 
 
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ప్రకాశ్ రాజ్‌కు తెలంగాణాలో ఓ ఫామ్ హౌస్ ఉంది. ఇక్కడే ఆయన తన లాక్‌డౌన్ సమయాన్ని గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఇందులో తన హత్యకు కొందరు స్కెచ్ వేశారనీ, అలాంటి వారు నైతికంగా చనిపోయారని చెప్పారు. తన హత్యకు ప్లాన్ వేశారన్న విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే.. ఆయన పూర్తిగా అండగా నిలబడటమే కాకుండా, పూర్తి రక్షణ కల్పించి, ఇక్కడే ఉండమని భరోసా ఇచ్చారని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. 
 
అలాగే, ఇకపై కరోనాకు ముందులాంటి పరిస్థితులు ఉండకపోవచ్చని తెలిపారు. పైగా, కరోనా తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తుందని తెలిపారు. అయితే, కరోనా తర్వాత అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటారా? అనే ప్రశ్నకు ప్రకాష్ రాజ్ సమాధానమిచ్చారు. 
 
ప్రతి ఒక్క హీరోకు ఉండే మార్కెట్ విలువ ఆధారంగా చేసుకుని నిర్మాతలకు రెమ్యునరేషన్ ఇస్తుంటారన్నారు. అయితే, కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకోక తప్పదన్నారు. కరోనా వైరస్ ప్రభావం ప్రతి రంగంపై ఉందనీ, అదేవిధంగా సినీ ఇండస్ట్రీపై ఉందన్నారు. అందువల్ల పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుని పోవాల్సిన పరిస్థితులు ఉంటాయన్నారు. అలాకాని పక్షంలో చాలా కష్టాలు ఎదుర్కోక తప్పదని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.