బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (12:31 IST)

మర్యాదరామన్న కాస్త.. మర్యాద కృష్ణయ్యగా మారాడు!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ కమ్ హీరో సునీల్ గతంలో నటించిన చిత్రం "మర్యాదరామన్న". దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కిచిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. అప్పటివరకు కమెడియిన్‌గా ఉన్న సునీల్ ఈ చిత్రంతో హీరో సునీల్‌గా మారిపోయాడు. 
 
ఈ సినిమాలో అమాయ‌కుడిగా, భ‌య‌స్తుడిగా సునీల్ క‌న‌బ‌ర‌చిన అభిన‌యం విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు కూడా పొందింది. ఈ సినిమా త‌ర్వాత ప‌లు సినిమాల‌లోను హీరోగా న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా హిట్ అయిన దాఖ‌లాలు లేవు. దీంతో కమెడీయ‌న్‌గా న‌టిస్తూ హీరోగా స‌త్తా చాటుతున్నాడు. 
 
ఈ క్రమంలో ఫిబ్రవరి 28వ తేదీన పుట్టిరోజు జరుపుకుంటున్న సునీల్.. "మర్యాదరామన్న" కాస్త "మర్యాదకృష్ణయ్య"గా మారిపోయాడు. ఆయ‌న హీరోగా తెర‌కెక్కుతున్న కొత్త చిత్రం 'మర్యాద కృష్ణయ్య' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. 
 
ఏటీవీ ఒరిజినల్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై కిషోర్‌ గరికపాటి, టీజీ విశ్వప్రసాద్‌, అర్చనా అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.ఎన్‌.ఆదిత్య దర్శకుడు. వివేక్‌ కూచిబొట్ట సహ నిర్మాత వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి సాయికార్తీక్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.  తాజాగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే సునీల్ మ‌ర్యాద రామ‌న్న‌ను గుర్తు చేసేలా క‌నిపిస్తున్నాడు.