శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

కోలీవుడ్‌లో మరో విషాదం - హాస్య నటుడు మయిల్ స్వామి శివైక్యం

mayil swamy
తమిళ చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు మయిల్ స్వామి ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం రాత్రంతా చెన్నై నగరంలోని ఓ శివాలయంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఇంటికి వస్తుండగా, గుండె నొప్పి వచ్చింది. 
 
దీంతో ఆయన్ను హుటాహుటిన చెన్నై పోరూరులోని శ్రీ రామచంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి, మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారని చెప్పారు. ఆయన వయసు 57 యేళ్లు. మయిల్ స్వామి మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీ విషాద చాయలు అలముకున్నాయి. ఆయన మరణం పట్ల అనేక మంది సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు.
mayilswamy
 
ఈయన 1984లో కె.భాగ్యరాజ్ నటించిన "దావణి కనవుగల్" అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన మయిల్ స్వామి ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటిస్తూ ప్రముఖ హాస్య నటుడుగా గుర్తింపు పొందారు. దివంగత వివేక్ - మయిల్ స్వామి, హాస్య నటుడు వడివేలు - మయిల్ స్వామి కాంబినేషన్‌లో వచ్చిన అనేక హాస్య సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. 40 యేళ్ళ సినీ కెరీర్‌లో దాదాపుగా 200కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన... గత యేడాది వచ్చిన "ది లెజెండ్" చిత్రంలోనూ నటించారు.