బ్రిటన్ పార్లమెంట్‌లో మోహన్ బాబు 'డైలాగ్ బుక్' విడుదల...
కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నాలుగు దశాబ్దాల నట జీవితంలో హీరోగా, విలన్‌గా, నిర్మాతగా ఎన్నో విజయాలను అందుకున్నారు. ఆరు వందలకుపైగా చిత్రాల్లో నటించిన ఆయన నటించిన చిత్రాల్లోని బెస్ట్ డైలాగ్స్‌ను ఓ పుస్తక రూపంలోకి తీసుకొస్తున్నామని ఇటీవల మోహన్ బాబు నటుడిగా నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలియజేశారు.
అనుకున్న షెడ్యూల్ ప్రకారం మోహన్ బాబు డైలాగ్ బుక్‌ను విడుదల చేశారు. ఈనెల 11వ తేదీన బ్రిటన్ పార్లమెంట్‌లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు బాబ్ బ్లాక్‌మెన్, వీరేంద్ర శర్మ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రమేష్ గోరిజాల పెయింటింగ్స్‌ను బ్రిటీష్ పార్లమెంట్ సభ్యులు బాబ్ బ్లాక్‌మెన్, వీరేంద్ర శర్మలకు మోహన్ బాబు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ మంచు అక్కడ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే మోహన్ బాబు చిన్న తనయుడు మంచు మనోజ్ తండ్రిని అనుకరించారు. అలాగే పెద్ద తనయుడు మంచు విష్ణు కోరిక మేరకు మోహన్ బాబు డైలాగ్ బుక్‌లోని 'పెద రాయుడు' సినిమాలో డైలాగ్స్ సహా పలు డైలాగ్స్‌ను చెప్పి ఆడియెన్స్‌ను అలరించారు.
ఈ పుస్తకంలో నటుడిగా నా తండ్రి నాకు ఇన్స్పిరేషన్, ఆయన తర్వాత నేను ఇన్స్పిరేషన్‌గా తీసుకున్న వ్యక్తి మోహన్ బాబుగారు అంటూ నందమూరి బాలకృష్ణ రాసిన వాక్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొదటి ఎడిషన్‌లో ప్రింట్ చేసిన పుస్తకాల్లో కొన్నింటిని ప్రముఖ వ్యక్తులకు, ఫ్యాన్స్‌ను పంపుతారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు నాలుగు దశాబ్దాల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ నెలలో వైజాగ్‌లో పెద్ద వేడుకను నిర్వహిస్తామని మంచు విష్ణు తెలియజేశారు.