మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (13:06 IST)

ఉచ్చపోయిస్తానన్న విలన్... ఊచకోత కోసిన వినయ విధేయ 'రామ్' (మూవీ రివ్యూ)

చిత్రం : వినయ విధేయ రామ 
నిర్మాణ సంస్థ : డీవీవీ ఎంటర్‍టైన్‌మెంట్స్ 
తారాగణం : రామ్ చరణ్, కియారా అద్వానీ, వివేక్ ఓబెరాయ్, ప్రశాంత్, స్నేహా, ఆర్యన్ రాజేశ్, తదితరులు., 
సంగీతం : దేవిశ్రీ ప్ర‌సాద్‌
నిర్మాత : డీవీవీ దానయ్య
కథ, దర్శకత్వం : బోయపాటి శ్రీను
విడుదల తేదీ : జనవరి 12, 2019.
 
బోయపాటి శ్రీను చిత్రం అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి బోయపాటికి మాస్ ఇమేజ్ ఉన్న మరో హీరో తోడైతే ఆ చిత్రం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. అలాంటి ఆసక్తే బోయపాటి - చెర్రీ కాంబినేషన్లో వచ్చిన "వినయ విధేయ రామ" చిత్రంపై నెలకొంది. ముఖ్యంగా, 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వచ్చిన చిత్రం కావడంతో ఆ ఆసక్తి మరింతా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ చిత్రం ప్రేక్షకులు ఊహించినట్టుగా ఉందా? లేదా? అన్నది ఇపుడు తెలుసుకుందాం. 
 
కథ : 
నలుగురు అనాథ పిల్లలు చెత్తకుప్పలో పేపర్లు ఏరుకుంటూ కనిపిస్తారు. కానీ, వీరికి జీవితంపై విరక్తిపుట్టి చనిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. అపుడు ఓ చిన్నపిల్లాడి ఏడుపు చెత్తకుప్పలో వినపడుతుంది. ఆ ఏడుపు విన్నవారు చనిపోవాలన్న నిర్ణయం మార్చుకుంటారు. తమకు దొరికిన పిల్లవాడికి రామ్ అనే పేరు పెట్టి మిగిలిన నలుగురు అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అలా ఆ నలుగురు కాస్త ఐదుగురు అవుతారు. ఈ నలుగురుకి తమ్ముడుగా రామ్ ఉంటాడు. అయితే, అన్నల చదువు కోసం తమ్ముడు చెర్రీ.. తన చదువు మానుకుని వారికోసం పాటుపడతాడు. 
 
నిజానికి రామ్ (చెర్రీ)కి దూకుడు ఎక్కువ. సమస్యలు ఎక్కడ కొనితెచ్చుకుంటాడోనని భయంతో అతని పెద్దన్న భువ‌న్ కుమార్(ప్ర‌శాంత్‌).. ఎవ‌రితో గొడ‌వ ప‌డొద్దు అంటూ ప్రమాణం చేయించుకుంటాడు. వైజాగ్‌లోని రామ్ అన్న‌య్య ఉప ఎన్నికల్లో పందెం ప‌రుశురాం(ముఖేష్ రుషి), బావ మ‌రిది బ‌ల్లెం బ‌ల‌రాం(హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) ఎదురునిలిచి ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా చూస్తాడు. ఈ ఎన్నికల సమయంలో భువ‌న్‌కు ఎదురు వవ్చిన ప‌రుశురాం మ‌నుషుల‌ను రామ్ చిత‌గ్గొడ‌తాడు. 
 
అప్పటి నుంచి ప‌గ‌బ‌ట్టిన ప‌రుశురాం.. ఎస్పీ స‌హ‌కారంతో అంద‌రినీ ఎన్‌కౌంట‌ర్ చేయాల‌నుకుంటాడు. అక్క‌డ‌కు రామ్ కూడా వ‌స్తాడు. అయితే అనుకోకుండా బీహ‌ర్ నుంచి వ‌చ్చిన రాజుభాయ్‌(వివేక్ ఒబెరాయ్) మ‌నుషులు రామ్ కుటుంబాన్ని చంపాల‌ని చూస్తే.. రామ్ అంద‌రినీ చంపేస్తాడు. ఆ తర్వాత బీహార్ ముఖ్య‌మంత్రి(మ‌హేష్ మంజ్రేక‌ర్‌) వ‌చ్చి రామ్‌తో మాట్లాడటం చూసిన ఎస్పీ... రామ్ బ్యాగ్రౌండ్‌కు భ‌య‌ప‌డి పారిపోతాడు. ఇంత‌కు రామ్‌ను క‌ల‌వ‌డానికి బీహార్ ముఖ్య‌మంత్రి ఎందుకు వ‌స్తాడు? రాజు భాయ్‌కి, రామ్‌కు ఉన్న విరోధమేంటి? అస‌లు రాజుభాయ్ వ‌ల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుంది? రామ్ త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనేదే ఈ చిత్ర కథ. ఈ విషయాలను తెలుసుకోవాలంటే చిత్రాన్ని తెరపై చూడాల్సిందే.
 
కథా విశ్లేషణ : 
బోయపాటి శ్రీను చిత్రంలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ "వినయ విధేయ రామ" చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా నలుగురు అనాథలు కలిసి పెంచుకున్న మరో అనాథ రామ్. ఈ ఐదుగురు అన్నదమ్ములకు ఓ ఆస్పత్రికి యజమానిగా ఉండే వైద్యుడు ఆశ్రయమిస్తాడు. అయితే, ఈ చిత్రంలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు వాస్తవికతకు దూరంగా ఉన్నాయి. బాలకార్మికులతో పని చేయించుకోవడం చట్టవిరుద్ధం. కానీ, ఇక్కడ తన అన్నల చదువు కోసం రామ్ తన బాల్యాన్ని త్యాగం చేసి శ్రమిస్తాడు. నలుగురు యువకులను చదివించే వైద్యుడు మరో బాలుడుని చదివించలేకపోయాడా? అనేది అంతుచిక్కని ప్రశ్న. 
 
ఇకపోతే, ఐపీఎస్ భార్యకు బీహార్ ముఖ్యమంత్రి ఎవరో తెలియకపోవడం మరో విచిత్రం. పైగా అన్న ఐపీఎస్ అయితే, మిగిలిన తమ్ముళ్లు కూడా అక్కడకే బదిలీ కావడం ఈ చిత్రంలోనే సాధ్యం, అంతేనా... ఓ సామాన్యుడి కోసం సాక్షాత్ ముఖ్యమంత్రి హైదరాబాద్ రావడం విచిత్రంగా ఉంది. ఇలాంటి పాయింట్లు, సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ మొత్తం చిత్రంలో మెచ్చుకోవాల్సిన విష‌యం హీరోయిజం. త‌న హీరో బ‌లాన్ని దర్శకుడు బాగా వాడేసుకున్నాడు. యాక్ష‌న్ ఎపిసోడ్స్ చేయ‌డానికి, భీభ‌త్సాన్ని తెర‌మీద ఓ స్థాయిలో చూపించ‌డానికి బోయ‌పాటి ఘ‌నాపాటి అనే విష‌యం ఈ చిత్రం ద్వారా మ‌రోసారి రుజువైంది. 
 
రామ్‌ చ‌ర‌ణ్ హీరోయిజం అడుగ‌డుగునా ఎలివేట్ అయింది. నిర్మాత పెట్టిన ఖ‌ర్చు తెర‌మీద భారీగా క‌నిపించింది. ప్ర‌తి ఫ్రేమూ నిండుగా క‌నిపించింది. ముఖేష్‌ రుషి ఎపిసోడ్ చివ‌ర‌కు ఏమైందో క్లారిటీ ఉండ‌దు. ప్రీ క్లైమాక్స్‌లో స్నేహ‌ను చూస్తే 'స‌రైనోడు'లో ర‌కుల్ ప్రీత్‌సింగ్ లుక్‌, ఎమోష‌న్ గుర్తుకొస్తాయి. దేవిశ్రీ పాట‌లు, కెమెరాప‌నిత‌నం, లొకేష‌న్లు, సెట్లు, కాస్ట్యూమ్స్, హార్స్ ఎపిసోడ్‌, న‌టీన‌టుల న‌ట‌న సినిమాకు ప్ల‌స్ పాయింటే. డైలాగులు బావున్నాయి. 'ఉచ్చ‌పోయిస్తా' అని ముఖేష్ రుషి అన్న‌ప్పుడు రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌వ‌ర్త‌న బీసీ సెంట‌ర్ల‌కు క‌నెక్ట్ అవుతుంది.
 
ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే, హీరో రామ్ చరణ్, నిర్మాణపు విలువలు, ఇంటర్వెల్ ఎపిసోడ్, యాక్షన్ పార్ట్‌లు, కియారా అద్వానీ అందాలు, ముఖేష్ రుషి విలనిజం హైలెట్‌గా ఉంటే, కథలో కొత్తదనం లేకపోవడం, తెరపై హింస ఎక్కువగా ఉండటం, ఆకట్టుకునేలా పాటలు లేకపోవడం, వాస్తవికతకు మరీ దూరంగా చిత్రం ఉండటం బలమైన మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు.