ఆర్ఆర్ఆర్ టీజర్‌తోనే వివాదాస్పదం, కొమురం భీంకి పాలాభిషేకం, ఏమైంది?
ఆర్.ఆర్.ఆర్. కరోనా ముందు నుంచి తెలుగు ప్రేక్షకుల్లో హీట్ రేపుతున్న సినిమా. సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమవుతున్నా ఇద్దరు ప్రముఖ యువ హీరోలతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాపై భారీ అంచనాలే ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఈ టీజర్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు అభిమానులు.
అయితే టీజర్ విడుదలైంది. కోట్లాదిమంది అభిమానులు తిలకించారు. కానీ ఇదే అసలు సమస్యగా మారింది. టీజర్ కాస్త వివాదాస్పదంగా మారింది. అందుకు కారణం కొమురం భీమ్ ముస్లిం టోపీ ధరించడమే. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తున్నాడు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఉన్న కొమురం భీం ప్రాంగణంలో ఉన్న కోమురం భీమ్ విగ్రహానికి యువసేన నేతలు పాలాభిషేకం చేశారు. భీమ్‌కు టోపీ ఎలా పెడతారని ప్రశ్నించారు. కొమురం భీమ్ నిజాం నిరంకశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని.. ఆయన చరిత్ర గురించి అసలు రాజమౌళి సరిగ్గా తెలుసుకోకుండా సినిమా తీస్తున్నారంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు సినిమా తీసి తమ మనోభావాలు దెబ్బ తినేవిధంగా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.