1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By SELVI.M

ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు "ఆవారా"!

లైఫ్‌లో ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకుంటూ జాలీగా గడిపే ఓ కుర్రాడు మొదటి చూపులోనే అమ్మాయి ప్రేమలో పడితే, అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయితో కారులో ప్రయాణం చేయాల్సి వస్తే.. అనంతరం పరిస్థితులు ఎలా ఉంటాయనే కథాంశంతో "ఆవారా" చిత్రం రూపొందింది. 

లవ్, రొమాన్స్, యాక్షన్ కలిసిన ఈ చిత్రాన్ని చక్కని ఎంటర్‌టైనర్ తీర్చిద్దామని చిత్ర నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ చెప్పారు. శుక్రవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన సమావేశంలో ఈ చిత్రం గురించి చెబుతూ.. "యుగానికి ఒక్కడు" తర్వాత కార్తీ నటించిన రెండవ చిత్రమిది. ఎన్నో సూపర్‌హిట్స్ ఇచ్చిన లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. ఇందులోని ఐదు పాటవకు యువన్‌శంకర్‌రాజా సంగీతం అందించారు. ఈ నెలలోనే ఆడియోను ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేయనున్నాం" అని చెప్పారు.

దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ.. రన్, పందెంకోడి చిత్రాలకు దర్శకత్వం వహించాను. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాను ఆదరిస్తున్నారు. ఇదే తరహాలో "ఆవారా" కూడా ఆదరిస్తారనే నమ్మకముంది. మేకింగ్‌లో వర్మ శైలి, లవ్‌స్టోరీలో భాగ్యరాజా ఛాయలు ఈ చిత్రంలో కన్పిస్తాయి. చక్కగా అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది" అని తెలిపారు.

తమన్నా మాట్లాడుతూ.. ఇందులో సింపుల్ అమ్మాయిగా నటించాను. ఎక్కువగా మాట్లాడుతాను. డ్రైవింగ్ చేస్తూ కారు ప్రయాణంలో సాగే కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. సూర్య, కార్తీ ఇద్దరితో నటించాను. ఇద్దరి నటనా శైలి వేర్వేరుగా ఉంది" అని చెప్పారు.

హీరో కార్తి మాట్లాడుతూ.. నా మొదటి చిత్రాన్ని తెలుగువారు ఆదరించారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకముంది. కారులో సీన్స్ చేయడం కెమెరామెన్‌కు రిస్క్ అయినా చక్కగా బందించారు. తమిళంలో "పయ్యా"గా, తెలుగులో "ఆవారా"గా ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కానుంది" అని వెల్లడించారు.