మంగళవారం, 25 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By SELVI.M

కిరాయి హీరో.. తండ్రిని చంపి "ఘటికుడు" అవుతాడా?

టైటిల్‌కు ఏ మాత్రం పొంతనలేని "ఘటికుడు"

నటీనటులు: సూర్య, నయనతార, భరత్ మురళీ, డిస్కో ఆనంద్, బి. సరోజాదేవి, షిండే, వడివేలు, రాహుల్‌దేవ్, రమేష్ కన్నా, మనోబాల, అలెక్స్, రియాజ్‌ఖాన్ తదితరులు,
దర్శకత్వం: కె.ఎస్. రవికుమార్,
నిర్మాత: చందన రమేష్,
కథ: రమేష్ కన్నా,
సంభాషణలు: శ్రీరామకృష్ణ,
కెమెరా: బి. ఎ. గణేష్.

సినిమాకు టైటిల్ ప్రధానం. టైటిల్‌ను బట్టే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందులో ఎంత పెద్ద హీరో లేదా గ్లామర్ హీరోయిన్ ఉన్నప్పటికి.. కథకు సరిపడా టైటిల్ ఉంటే చూడ్డానికి, వినడానికి బాగుంటుంది. కొన్ని సినిమాలకు టైటిల్సే అతకవు. అసలు పొంతనే ఉండదు. అలాంటి కోవలోనే సూర్య నటించిన "ఘటికుడు" సినిమాను చెప్పుకోవచ్చు.

తమిళంలో తీసిన "ఆదవన్" చిత్రాన్ని తెలుగులో ఘటికుడుగా అనువదించారు. దీపావళికి ఈ సినిమా విడుదలైంది. ముందునుంచి అత్యంత భారీ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దామని ప్రకటనలు గుప్పించి, సూర్యను హైస్కూల్ చదివే విద్యార్థిగా వాడినందుకు గ్రాఫిక్స్‌కు అధికంగా ఖర్చయిందని ఎన్ని కబుర్లు చెప్పినా.. కథలో పెద్దగా ట్విస్ట్‌లేకపోవడం, సాదాసీదాగా సాగే గమనంతో ఎంతో ఊహించుకుని వచ్చిన ప్రేక్షకులను ఘటికుడు నిరుత్సాహపరుస్తాడనే చెప్పాలి.

ఇక కథలోకి వెళితే.. అశోక్ (సూర్య) కొల్‌కత్తాలో చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటాడు. అతనిని తండ్రిగా పెంచి పెద్దచేసిన వాడు షిండే. డబ్బుకోసం చంపడాలు, కాల్చడాలు వంటివి వీరి వృత్తి. వీరి గ్రూప్‌లోని వాడు డిస్కో ఆనంద్. వీరంతా కలిసి ఏ పనైనా వెనుకాడక చేస్తుంటారు. అతుల్‌కులకర్ణి (రాహుల్‌దేవ్) వీరికి ఇన్వెస్టిగేషన్ నిమిత్తం వచ్చిన జడ్జి భతర్‌మురళీని చంపమని ప్రోత్సహిస్తాడు. అందుకు కోట్ల రూపాయలు ఇస్తానంటాడు.

చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వారి అవయవాలను విదేశాలకు చేర్చి కోట్లు సంపాదిస్తున్న ముఠా గురించి ఇన్వస్టిగేషన్ చేయడానికి భరత్ మురళీ వస్తాడు. మొదటిసారి అశోక్ గురితప్పి జడ్జి తప్పించుకుంటాడు. ఈలోగా అతుల్‌కులకర్ణి నుంచి తీవ్ర ఒత్తిడి బెదిరింపులు రావడంతో మరో అవకాశం తీసుకుని జడ్జి ఇంటిలోనే సూర్య మకాం పెట్టేస్తాడు.

అనుక్షణం ఆయన్ను చంపాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ప్రతిసారి జడ్జి తప్పించుకుంటాడు. దీంతో అతుల్‌కులకర్ణికి అశోక్‌పై అనుమానం వస్తుంది. అశోక్‌నే చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఎవరు గెలిచారు.? జడ్జి ఏమయ్యాడు? మధ్యలో నయనతార పాత్ర ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
WD
విశ్లేషణ: ఇది ఫక్తు పాత సినిమా కథే. రెండు ముక్కల్లో చెప్పాలంటే.. ప్రాణాలు తీసే నైజమున్న కిరాయి హీరోకు ఒకవ్యక్తిని చంపమని పురమాయిస్తే చంపకుండా దాటవేయడం అనేదాంట్లోనే స్టోరీ అర్థమైపోతుంది. ఎందుకు చంపలేకపోతున్నాడు? తర్వాత ఏమవుతుంది? అనేదాన్ని కాస్త టెన్షన్ క్రియేట్ చేసి చూపడంలో కె. ఎస్. రవికుమార్ సఫలీకృతుడయ్యాడు. మిగతాదంతా పాత రూటే.

సూర్య పాత్రమేరకు బాగా నటించాడు. ముఖ్యంగా యోగాసనాలు వేసేవిధానం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఛేజింగ్‌లో కూడా కాస్త గ్రాఫిక్స్ అయినా యాక్షన్ సన్నివేశాలు బాగా చేశాడు. డాన్స్‌పరంగానూ బాగా చేశాడు. తార (నయనతార) జడ్జి మేనకోడలుగా నటించింది. ఆమె పాత్ర రొటీన్‌గా ఉంది.

తార అత్తగా బి. సరోజాదేవి ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. అలనాటి హీరోయిన్ అయిన ఆమెలో వయసుమీద పడినా చమక్కు తగ్గలేదు. తన పాత్రకు తగిన న్యాయం చేసింది. జడ్జిగారి ఇంట్లో వంటవాడి పాత్రలో వడివేడు చక్కగా అమరాడు. ఆ పాత్రే ఆద్యంతం నవ్విస్తుంది. ప్రత్యేకించి కామెడీట్రాక్ లేకుండా సూర్య, వడివేలు పాత్రలే ప్రేక్షకులను అలరిస్తాయి.

ఇకపోతే.. జడ్జిని సూర్య చంపే విషయం తెలిసినా.. తన వీక్‌నెస్ ఎక్కడ బయటపెడతాడేమోనని భయంతో వడివేలు చేసిన నటన, అందుకు సపోర్ట్ చేసిన సూర్య పాత్రలే కథకు కీలకం.

మొదటిభాగం ఇంట్రెస్ట్‌గా సాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఏమాత్రం పట్టులేకపోవడంతో "ఘటికుడు" సడలిపోయాడు. కథ పాత కథే. తన తండ్రిని చంపే బాధ్యత తనపై పడితే ఆ హీరో ఏంచేస్తాడు అనేది.. ముందుగానే ప్రేక్షకులకు తెలిసిపోతుంది. దానికోసం కథను సాగదీస్తున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది.

ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సూర్య హైస్కూల్ విద్యార్థి పాత్ర గురించే. సూర్య విద్యార్థిగా ఉన్నప్పుడు విజువల్ ఎఫెక్ట్స్‌తో సూర్య ముఖకవళికలు వచ్చేలా జాగ్రత్తపడటం, ఆ క్రమంలో ముఖం కదలికలు గ్రాఫిక్స్ అనేవి కొన్ని సీన్స్‌లో తెలిసిపోతాయి. పాటలపరంగా "డమక్ డమక్ డమ్మా.." పాట హుషారెత్తిస్తుంది. మిగిలినవి.. సోసోగా ఉంటాయి.

చివరిగా చెప్పాలంటే.. ఈ సినిమా మొత్తం జడ్జి అయిన భరత్ మురళీని చంపడానికి సూర్య ప్రయత్నిస్తాడు. క్లైమాక్స్‌లో జడ్జి చనిపోతాడు అనుకున్న తరుణంలో హీరో ఏవిధంగా రక్షిస్తాడు. ఇన్వెస్టిగేషన్‌కు వచ్చిన భరత్‌మురళీతో విలేకరుల సమావేశం జరుగుతుంది. నిజాయితీగల అధికారిగా పనిచేస్తారా? లేదా? అనే ప్రశ్నకు.. "దేనికి లొంగను. నా ధర్మం నేను నెరవేరుస్తాను. లేదంటే పరలోకానికే వెళతాను" అని భరత్‌మురళీ డైలాగ్ చెబుతాడు.

ఈ డైలాగ్ సందర్భాన్నిబట్టి ఆశ్చర్యానికి గురిచేసినా.. నిజజీవితంలో.. భరత్‌మురళీ ఈ సినిమా షూటింగ్ తర్వాతే పరలోకానికి వెళ్ళడం.. నిజంగానే ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయనకు అంకితంగా ఈ డైలాగ్‌ను పేర్కొనడం నిర్మాతకు ఆయనపై గల కృతజ్ఞతను తెలియజేస్తుంది.