ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?
ఆ పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని ఆ గ్రామ ప్రజల మూఢనమ్మకం. దీంతో ఆ గ్రామంలోని వారు పూజారి తన్నుల కోసం బారులు తీరుతారు. ఇదే సంప్రదాయాన్ని 500 యేళ్ళుగా పాటిస్తున్నారు. ఇంతకీ ఏంటీ ఈ సంప్రదాయం. ఎందుకు పోటీ చేస్తున్నారు. దీని వెనుక అసలు కథేంటో పరిశీలిస్తాం.
ఏపీలోని కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం చిన్న హోతూరు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి యేటా ఏప్రిల్ నెలలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులోభాగంగా, వేడుకలు చివరి రోజున శివపార్వతులకు కళ్యాణం జరిపిస్తారు. అయితే, ఆ కార్యక్రమంలో భక్తులు కొన్ని తప్పులు చేశారని ఆగ్రహంతో వీరభద్ర స్వామి ఆలయ పూజారి రూపంలో ఉత్సవ విగ్రహాలను తలమీద పెట్టుకుని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను కాలితో తంతారు.
ప్రతి యేటా ఆచారంగా వచ్చే ఈ సంప్రదాయ ఉత్సవాన్ని ఈ సారి కూడా ఘనంగా నిర్వహించారు. పూజారితో తన్నులు తిన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కార్యక్రమం తర్వాత శ్రీ సిద్ధేశ్వర స్వామికి వసంతోత్సవం జరిపించారు. ఇది ముగిసిన వెంటనే గ్రాస్థులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతల్లో గులాబీ రంగు కలిపి నీటిని మొక్కుగా సమర్పించారు. ఆ రంగు నీళ్లతో వసంతోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటారు. ఇలా గ్రామమంతా ఒకే రంగు వినియోగించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు వెల్లడించారు. ఈ సంప్రదాయాన్ని చూసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి చాలా మంది అక్కడికి వస్తుంటారు.