ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (15:39 IST)

"ఆటగాళ్లు" ఓకే కానీ... ఆట ఇంకాస్త బాగా ఆడాల్సింది...

'పెద‌బాబు', 'ఆంధ్రుడు' వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ప‌రుచూరి ముర‌ళి. క‌థ‌ల ఎంపిక‌లో నారా రోహిత్ ప్ర‌త్యేక‌త‌ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. జ‌గ‌ప‌తిబాబు కూడా ఈ మ‌ధ్య బ‌ల‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తూ ప్ర

మూవీ : ఆట‌గాళ్ళు
సంస్థ‌: ఫ్రెండ్స్‌ అండ్ క్రియేష‌న్స్.
తారాగణం : నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబు, బ్ర‌హ్మానందం, ద‌ర్శ‌న బానిక్ త‌దిత‌రులు.,
సంగీతం: సాయికార్తీక్‌. 
నిర్మాత‌లు: వాసిరెడ్డి ర‌వీంద్ర‌నాథ్, వాసిరెడ్డి శివాజీ ప్ర‌సాద్, రాము మ‌క్కెన‌, వ‌డ్ల‌పూడి జితేంద్ర‌. 
ద‌ర్శ‌క‌త్వం: ప‌రుచూరి ముర‌ళి. 
విడుద‌ల తేదీ: 24-08-2018.
 
'పెద‌బాబు', 'ఆంధ్రుడు' వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ప‌రుచూరి ముర‌ళి. క‌థ‌ల ఎంపిక‌లో నారా రోహిత్ ప్ర‌త్యేక‌త‌ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. జ‌గ‌ప‌తిబాబు కూడా ఈ మ‌ధ్య బ‌ల‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తూ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. మరి ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే "ఆటగాళ్లు". ఇద్ద‌రు తెలివైన వ్య‌క్తులు మైండ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుంద‌నే దాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. వ్య‌క్తుల‌కు ఉండే ప‌రువు పోకూడ‌దు అనే త‌త్వం వారిని ఎంత‌కైనా దిగ‌జారుస్తుంది. ఈ క‌థాంశంతోనే సినిమాను రూపొందింది. విల‌న్‌గా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న జ‌గ‌ప‌తిబాబు ఈ సినిమాలో క్రిమిన‌ల్ లాయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తే.. హీరో నారా రోహిత్ ద‌ర్శ‌కుడిగా న‌టించాడు. అలాంటి ఇద్దరు వైవిధ్యమైన నటులతో వచ్చిన ఈ "ఆటగాళ్లు" మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది పరిశీలిద్ధాం.
 
చిత్ర కథ : 
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ (నారారోహిత్‌) త‌న ప్రియురాలు అంజ‌లి (ద‌ర్శ‌న బానిక్‌)ని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ల వైవాహిక జీవితం స‌వ్యంగా సాగుతున్న ద‌శ‌లోనే అంజ‌లి హ‌త్య‌కి గుర‌వుతుంది. ఆ నేరంపై సిద్ధార్థ్‌ను అరెస్టు చేస్తారు. ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ అయిన వీరేంద్ర (జ‌గ‌ప‌తిబాబు) కేసు కోసం రంగంలోకి దిగుతాడు. జ‌డ్జి అనుమ‌తితో సిద్ధార్థ్‌ని క‌స్ట‌డీలో ప్ర‌శ్నించ‌డం మొద‌లుపెడ‌తాడు. ఆ క్ర‌మంలో సిద్ధార్థ్ త‌న గురించి వీరేంద్ర‌కి ఏం చెప్పాడు? నిజంగా సిద్ధార్థే త‌న భార్య‌ని అంతం చేశాడా? ఈ కేసు ఎన్ని మ‌లుపులు తిరిగింది? సిద్ధార్థ్‌కీ, వీరేంద్ర‌కీ మ‌ధ్య సాగిన ఆటలో గెలుపెవ‌రిద‌నే విష‌యాలు తెర‌పైనే చూడాలి.
 
కథ ఎలా సాగిందంటే : 
ఈ చిత్ర కథ ఇద్ద‌రు తెలివైన వ్యక్తుల మ‌ధ్య మైండ్ గేమ్‌గా సాగుతుంది. క‌థ ఎత్తుగ‌డ ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. భార్య‌ని హ‌త్య చేసిన కేసులో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడైన సిద్ధార్థ్ అరెస్ట్ అవుతాడు. ఆ స‌న్నివేశాలే ప్రేక్ష‌కుడిలో ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. క‌థ‌లో తొంద‌ర‌గా లీన‌మ‌య్యేలా చేస్తాయి. విచార‌ణ కోసం క‌స్ట‌డీలోకి వెళ్లిన లాయ‌ర్ వీరేంద్ర‌కి త‌న క‌థని చెప్ప‌డం మొద‌లుపెడ‌తాడు సిద్ధార్థ్‌. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొద‌ల‌వుతుంది. ఆరంభం మామూలుగా అనిపించినా, ఆ త‌ర్వాత క‌థ లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.
 
మైండ్ గేమ్ ఆటంతా ద్వితీయార్థంలోనే మొద‌ల‌వుతుంది. ఈ త‌ర‌హా సినిమాల‌కి క‌థ‌, క‌థ‌నాలు ఎంత ముఖ్య‌మో.. వాటిని అంతే ప‌క‌డ్బంధీగా... ఆద్యంతం ప‌ట్టు స‌డ‌ల‌కుండా తెర‌పైకి తీసుకురావ‌డం అంతే ముఖ్యం. క్రైమ్ డ్రామా క‌థ‌లు త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తిని పెంచాలి. జ‌గ‌ప‌తిబాబు, నారా రోహిత్ మ‌ధ్య స‌న్నివేశాల వ‌ర‌కు ద‌ర్శ‌కుడు బాగా క‌స‌ర‌త్తు చేశారు. కానీ, మొత్తంగా అదే త‌ర‌హా ఫీల్ పండించ‌డంలో కాస్త విఫలమయ్యాడని చెప్పొచ్చు. అక్క‌డ‌క్క‌డ స‌న్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతున్న‌ట్టు అనిపిస్తాయి. ప‌తాక స‌న్నివేశాల్లో మ‌లుపులు ఆక‌ట్టుకుంటాయి. ప్ర‌థ‌మార్థంతో పోలిస్తే ద్వితీయార్థం ప్రేక్ష‌కుడికి మంచి వినోదాన్ని పంచుతుంది. కానీ, నారా రోహిత్, బ్రహ్మానందం మధ్య సాగే హాస్యపు సన్నివేశాలు పెద్దగా నవ్వు తెప్పించవు. 
 
విశ్లేషణ : 
ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌గా జ‌గ‌ప‌తిబాబు లుక్‌, ఆయ‌న హావ‌భావాలు చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. నారా రోహిత్ కూడా సిద్ధార్థ్ పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఆయ‌న పాత్ర ప్రేక్ష‌కులకి థ్రిల్‌ని పంచుతుంది. ద‌ర్శ‌న‌బానిక్ అందంతో ఆక‌ట్టుకుంటుంది. బ్ర‌హ్మానందం ద్వితీయార్థంలో కూడా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు కానీ, ఆ స‌న్నివేశాలు అంతగా పండ‌లేదు. వాణిజ్య చిత్రాల్ని, కుటుంబ క‌థ‌ల్ని తెర‌కెక్కించి మెప్పించిన ప‌రుచూరి ముర‌ళి, ఈసారి ఓ క్రైమ్ డ్రామాని ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయ‌న క‌థ సిద్ధం చేసుకొన్న విధానం, పాత్ర‌ల్ని తీర్చిదిద్దిన తీరు ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. సాయికార్తీక్ నేప‌థ్య సంగీతం, విజ‌య్ సి.కుమార్ కెమెరా ప‌నిత‌నం క‌థ‌కి బ‌లాన్నిచ్చాయి. సాంకేతికంగా సినిమా బాగుంది.
 
ఈ చిత్రం బలాలను పరిశీలిస్తే, నారారోహిత్, జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న‌, ఆ ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నివేశాలు, చిత్ర కథ అని చెప్పుకోవచ్చు. అలాగే, బ‌ల‌హీన‌త‌ల పరంగా చూస్తే లాజిక్‌లేని స‌న్నివేశాలు, ప‌స లేని క‌థ‌నం, పండని హాస్యం వంటివి చెప్పుకోవచ్చు.