మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 జులై 2018 (17:21 IST)

లాజిక్కు లేని బెల్లంకొండ "సాక్ష్యం" (మూవీ రివ్యూ)

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ వారసునిగా వెండితెర అరంగేట్రం చేసిన యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. గతంలో మూడు కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత ఇపుడు "సాక్ష్యం" పేరుతో స

నిర్మాణ సంస్థ : అభిషేక్ పిక్చ‌ర్స్‌ 
తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రానా, జయ ప్రకాష్, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు. 
నిర్మాత: అభిషేక్ నామ. 
దర్శకత్వం : శ్రీవాసు. 
 
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ వారసునిగా వెండితెర అరంగేట్రం చేసిన యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. గతంలో మూడు కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత ఇపుడు "సాక్ష్యం" పేరుతో సరికొత్త ప్రయత్నం చేశాడు. గతంలో 'ల‌క్ష్యం', 'లౌక్యం', 'డిక్టేట‌ర్' చిత్రాల‌తో విజ‌యాల్ని సొంతం చేసుకొన్నాడు. సృష్టిలో జ‌రిగేదానికి నాలుగు దిక్కులే కాదు.. ప్ర‌కృతి కూడా సాక్ష్యం. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌కృతే ప్ర‌క్షాళ‌న చేస్తుంద‌నే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. మ‌రి ఈ అంచ‌నాల‌ను సినిమా అందుకుందా? లేదా అని తెలుసుకోవాలంటే క‌థేంటో చూద్దాం.
 
క‌థ:
స్వ‌స్తిక్ పురం గ్రామంలోని రాజుగారు(శ‌ర‌త్‌కుమార్‌) పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండే వ్య‌క్తి. అదే ప్రాంతంలో ఉండే మున‌స్వామి (జగపతిబాబు) అత‌ని సోదరులు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంటారు. వారికి ఎదురు తిరిగిన రాజుగారిని, అత‌ని కుటుంబాన్ని దారుణంగా చంపేస్తారు. అయితే రాజుగారికి పుట్టిన కొడుకుని ఎద్దు కాపాడ‌టంతో త‌ప్పించుకుంటాడు. కాశీ చేరిన ఆ శిశువుని శివ ప్ర‌కాశ్‌(జ‌య‌ప్ర‌కాశ్‌) చెంత‌కు చేరుతాడు. పిల్ల‌లు లేని శివ ప్ర‌కాశ్ ఆ పిల్లాడికి విశ్వ‌జ్ఞ(బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) అనే పేరు పెట్టి పెంచుతాడు. విశ్వ విదేశాల్లో పెరిగి పెద్దవాడవుతాడు. 
 
విశ్వ వీడియో గేమింగ్‌ల‌ను ప్లాన్ చేసి చిత్రీక‌రిస్తుంటాడు. ఓ సంద‌ర్భంలో సౌంద‌ర్య‌ల‌హ‌రి(పూజా హెగ్డే)ని చూసి ప్రేమిస్తాడు విశ్వ‌. ఆమెకు ఓ సంద‌ర్భంలో స‌హాయం చేస్తాడు. కానీ అది అర్థం చేసుకోని సౌంద‌ర్య.. విశ్వ‌పై కోపంతో ఇండియాకు వ‌చ్చేస్తుంది. విశ్వ కూడా సౌంద‌ర్య కోసం భారత్‌కు వ‌చ్చేస్తాడు. అదేస‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని సౌంద‌ర్య తండ్రి మున‌స్వామి ఆక్ర‌మాల‌కు అడ్డుప‌డుతుంటాడు. మున‌స్వామికి వ్య‌తిరేకంగా కొన్ని సాక్ష్యాల‌ను సేక‌రిస్తుంటాడు. మున‌స్వామి త‌మ్ముడు వీరాస్వామి(ర‌వికిష‌న్‌) సౌంద‌ర్య‌ను చంపేయాల‌నుకుంటాడు. కానీ ప్ర‌కృతి కార‌ణంగా చ‌నిపోతాడు. దానికి విశ్వ ప‌రోక్షంగా కార‌ణ‌మ‌వుతాడు. అలాగే మున‌స్వామి ఇద్ద‌రు త‌మ్ముళ్లు కూడా విశ్వ చేతిలోనే చనిపోతారు. అస‌లు మున‌స్వామి అండ్ బ్ర‌ద‌ర్స్‌పై ప్ర‌కృతి ఎందుకు కోపం తెచ్చుకుంటుంది? చివ‌ర‌కు మున‌స్వామి ప‌రిస్థితేంటి? మునుస్వామి కుటుంబంపై విశ్వ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనేదే చిత్ర కథ. 
 
కథా విశ్లేషణ.. 
"గాలి, నిప్పు, నేల‌, మ‌ట్టి, ఆకాశం.. ఈ పంచ‌భూతాలు మ‌నిషిని సృష్టిస్తాయి, నాశ‌నం చేస్తాయి. ప్ర‌కృతి ధ‌ర్మాన్ని మ‌నం పాటిస్తే మ‌న ఉన్న‌తికి తోడ్పడుతాయి. వాటిని అతిక్ర‌మిస్తే అంతం చూస్తాయి. అష్ట‌దిక్కుల్లో ఏ క‌న్ను చూడ‌క‌పోయినా, మ‌నం చేసే మంచి చెడుల‌ను పైనుంచి భ‌గవంతుడు చూస్తుంటాడు. మంచి చెడుల‌ను బేరీజు వేసి పాపాన్ని ప్ర‌క్షాళ‌న చేస్తాడు. మ‌నిషి ధ‌ర్మాన్ని పాటించాలి" అని చెప్పే సినిమా ఇది. మామూలుగా ఇలాంటి సినిమా చేస్తే ఆధ్యాత్మిక సినిమా అవుతుంది. 
 
అయితే ఈ సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మేళ‌వించి, నేటి ట్రెండ్‌లో అంద‌రికీ అర్థ‌మ‌య్యే వీడియో గేమ్ రూపంలో క‌థ‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ఒక మ‌నిషి రాసే స‌న్నివేశాలు.. నిజ జీవితంలో హీరోకి అవే ఎదుర‌వ‌డం తెలుగు తెర‌కు కొత్త కాదు. కాక‌పోతే పంచ‌భూతాల సాక్షిగా వాటిని నెర‌వేర్చ‌డం అనేది మాత్రం కొత్తే. వీటిని దర్శకుడు చాలా తెలివిగా వాడుకున్నాడు. ఈ పంచ భూతాలను ఉపయోగించి, శత్రు సంహారం చేయించిన తీరు చాలా బాగుంది. తొలి 10 నిమిషాలు చాలా పట్టుగా, ఉత్కంఠ భరితంగా తెరకెక్కించగలిగాడు. అయితే, ఆ తర్వాత విదేశాల్లో సాగిన విశ్వ, సౌందర్య లహరి(పూజ హెగ్డే)ల ప్రేమకథ కాస్త విసిగిస్తుంది. వీడియోగేమ్‌ల నేపథ్యం కూడా అదే బాపతు. కథానాయకుడిని ఇండియా తీసుకొచ్చాక, శత్రు సంహారం మొదలు పెట్టిన తర్వాతే కథ ఊపందుకుంటుంది. విశ్రాంతి ఘట్టం మరోసారి ఉత్కంఠ రేకెత్తించేలా సాగడంతో ప్రథమార్థం గట్టెక్కగలిగింది.
 
ఇక రెండో భాగంలో మిగిలిన శత్రువులను కథానాయకుడు చంపే విధానం ఆద్యంతం మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చూపించగలిగాడు. యాక్షన్‌ ఎపిసోడ్‌ ఒక్కోటి ఒక్కో తరహాలో సాగుతుంది. పంచ భూతాలను యాక్షన్‌ ఎపిసోడ్‌లో మేళవించాలన్న ఆలోచన రొటీన్‌ కథను సరికొత్తగా ఆవిష్కరించింది. కథానాయకుడికి తన గతం తెలియకుండా దాస్తూనే, తనకు అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేలా చూపించడం కొత్త ఎత్తుగడ. పంచ భూతాలకు సంబంధించిన లింకులన్నీ సరిగానే వేసుకున్నాడు. అయితే, మధ్యమధ్యలో సినిమాను మరింత కమర్షియల్‌ చేయడానికి పాటలను ఇరికించాడేమో అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు ఊహించినట్లు సాగినప్పటికీ మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. మొత్తంగా చెప్పాలంటే, ఒక సగటు కథను, ఒక కొత్త నేపథ్యం ఎంచుకుని, భారీ హంగులు జోడించి, తెరకెక్కించడంలో దర్శక-నిర్మాతలు సఫలీకృతమయ్యారని చెప్పొచ్చు. 
 
అదేవిధంగా హీరో బ్యాక్‌గ్రౌండ్‌, హీరోయిన్ పాత్ర బావున్నాయి. అడ్వంచ‌ర్స్‌ని ఇష్ట‌ప‌డే కుర్రాడిగా, రిచ్ కిడ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చ‌క్క‌గా చేశారు. ఈ సినిమాలో ఎక్కువ క్రెడిట్‌ని కొట్టేసేది పీట‌ర్ హెయిన్‌. గ్రాఫిక్స్ కూడా బావున్నాయి. సంగీత ద‌ర్శ‌కుడు రామేశ్వ‌ర్ కొత్త‌వాడైనా చాలా బాగా రీరికార్డింగ్ ఇచ్చారు. సన్నివేశాల‌కు స‌గం బ‌లం రీరికార్డింగే. హీరో, హీరోయిన్ల చేత డ‌బ్బింగ్ చెప్పించ‌డంలో మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సింది. సెట్స్ పాట‌ల‌ను క‌నుల‌కు విందు చేశాయి. పాట‌లు ట్యూన్లప‌రంగా పెద్ద‌గా గొప్ప‌గా లేక‌పోయినా, సెట్స్‌తో క‌లిపి చూసేట‌ప్పుడు బావున్నాయి. నిర్మాత పెట్టిన ఖ‌ర్చు మొత్తం తెర‌మీద క‌నిపించింది. 
 
చిత్ర ప్లస్ - మైనస్ పాయింట్లను పరిశీలిస్తే, 
ఈ చిత్ర ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే, విజువ‌ల్స్, రీరికార్డింగ్‌, డైలాగులు, ప్రొడ‌క్షన్ వాల్యూస్‌ బాగున్నాయి. అలాగే, మైన‌స్ పాయింట్లను పరిశీలిస్తే, అక్క‌డ‌క్క‌డా క‌న్‌ఫ్యూజన్‌, విల‌నిజం బ‌లంగా లేకపోవడాన్ని చెప్పుకోవచ్చు.