శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (09:01 IST)

మెరిపించేలా చేసిన‌ మెరిసేమెరిసే

Dinesh-swetha
న‌టీన‌టులుః 
'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ త‌దిత‌రులు
 
సాంకేతిక‌తః 
నిర్మాత: వెంకటేష్ కొత్తూరి, ర‌చ‌న‌, దర్శకత్వం: పవన్ కుమార్. కె, సినిమాటోగ్ర‌ఫీ: న‌గేశ్ బానెల్, సంగీతం: కార్తిక్ కొడగండ్ల, ఎడిట‌ర్‌:  మ‌హేశ్‌, 
 
ప్రేమించ‌డం, త‌ర్వాత బ్రేక‌ప్ చెప్ప‌డం, ఆ త‌ర్వాత మ‌ర‌లా క‌లుసుకోవ‌డం, లేదంటే వేరే వారితో రిలేష‌న్‌లో వుండ‌డం అనేవి ఈరోజుల్లో చాలా క‌థ‌లు వ‌చ్చాయి. ఒక్కో ద‌ర్శ‌కుడిది ఒక్కో తీరుగా సినిమాలు వుంటున్నాయి. కాగా,  'మెరిసే మెరిసే- సినిమా లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల‌యిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
క‌థః
దినేశ్ తేజ్ వైజాగ్‌లో వ్యాపార వేత్త కొడుకు. తండ్రి బాధ్య‌త‌లు అప్ప‌జెప్పాలంటే త‌ల్లి గారాబం బ‌లంగా వుంటుంది. దాంతో బిటెక్ చ‌దివిన దినేశ్ సాఫ్ట్‌వేర్ రంగంలో ఏదో సాధించాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వుతాడు. దానివ‌ల్ల అవ‌త‌లి వ్య‌క్తికి న‌ష్టం చేకూరుతుంది. ఇంకోవైపు ప్రేమించిన అమ్మాయితోకూడా బ్రేక‌ప్ అవుతుంది. మ‌రోవైపు బి.కామ్ పాస్ కాని అమ్మాయి శ్వేతా అవస్తి. త‌ల్లిలేని ఆమెకు అన్నీ తండ్రే. ఎన్‌.ఆర్‌.ఐ. డాక్ట‌ర్‌తో నిశ్చితార్థం జ‌రుగుతుంది. కానీ పెళ్లికి 8 నెల‌లు గేప్ వ‌స్తుంది. ఈలోగా వీసా ప‌నులు కోసం శ్వేత‌ను హైద‌రాబాద్‌కూ తీసుకువ‌చ్చి బంధువుల ఇంటిలో వుంచుతారు. ఇక ఇక్క‌డ స్వేచ్ఛ‌గా వున్న‌ట్లు అనిపించిన శ్వేత‌కు త‌న గోల్‌ను సాధించ‌డం కోసం ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఆ స‌మయంలో ఆమెకు ఎవ‌రు సాయం చేశారు? ఎన్‌.ఆర్‌.ఐ. కుటుంబం అందుకు ఒప్పుకుందా? ఆ త‌ర్వాత ఏమ‌యింది? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేష‌ణః
 
సినిమా అన‌గానే హీరో బాధ్య‌త‌లు తెలీని వాడిగా చూపించ‌డం కొన్ని సినిమాల్లో మామూలే. అయితే ఇందులో వ‌య‌స్సుతోపాటు బాధ్య‌త తెలీని విధంగా పెర‌డ‌గ‌డం, ఆ త‌ర్వాత త‌న జీవితంలో ఎదుర‌యిన మెరుపు వ‌ల్లే అత‌ను ఎలా బాధ్య‌త‌గ‌ల వ్య‌క్తిగా మారాడ‌నేది మెరిసే మెరిసే సినిమాలో ద‌ర్శ‌కుడు చూపించాడు. స్త్రీ, పురుషులు స‌మాన‌మ‌నే అంటారు కానీ ఎక్క‌డా అది క‌నిపించ‌దు. శ్వేత పాత్ర చూపించారు. మ‌హిళ‌కూడా ఓ మ‌న‌సుంటుంది, త‌న కాళ్ళ‌పై తాను జీవితంలో ఎద‌గాలనే తాప‌త్ర‌య‌పడుతుంది. అనేవి చ‌క్క‌గా వివ‌రించారు. కానీ సినిమాక‌నుక కొన్ని సినిమాటిక్ స‌న్నివేశాలు వున్నాయి. ఫ్యాష‌న్ డిజైన‌ర్ కోర్సు చేయ‌ని అమ్మాయి పారిస్‌కు వెళ్ళే స్థాయికి చేర‌డం అనేది కాస్త ఆశ్చ‌ర్యం వేసినా, హీరోతో ఆమె జ‌ర్నీ ఆ త‌ర్వాత ఆమె మెచ్చూరిటీ సాధించిన తీరు బాగుంది. స‌న్నివేశ‌ప‌రంగా సంజ‌య్ స్వ‌రూప్ భార్య చెప్పిన సంభాష‌ణ‌లు ఆమెలోని మ‌నోధైర్యాన్ని నింపుతాయి. ఇలాంటివి ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు ఎంతైనా అవ‌స‌రం. అలాలేనివారు చాలామంది పెళ్లి అనే తంతుకు క‌ట్టుబ‌డి రాజీగా బ‌తికేస్తుంటారు.
 
ఇక ఇందులో నిశ్చితార్థం తంతు ఆ త‌ర్వాత ఆ డాక్ట‌ర్ త‌ల్లి శ్వేత‌పై చేస్తున్న పెత్త‌నం వంటివి ఆనంద్ సినిమాను కొద్దిసేపు గుర్తు చేస్తాయి. అయినా త‌ర్వాత జ‌రిగే స‌న్నివేశాలు మ‌ర్చిపోయేలా చేస్తాయి. చాలా ప‌రిమిత‌మైన న‌టుల‌తో ప‌రిమితంగా తీసిన ఈ సినిమా నిర్మాత అభిరుచికి నిద‌ర్శ‌నం. యూత్ సినిమాల పేరుతో అస‌భ్య‌త‌కు తావులేకుండా తీయ‌డం అభినంద‌నీయ‌మే. 
 
న‌ట‌నాప‌రంగా పాత్ర‌ప‌రంగా జీవితంలో ఏదో కోల్పోయిన వ్య‌క్తిగా దినేష్ బాగా న‌టించాడు. త‌ల్లిలేని అమ్మాయి అత్త‌వారింటికి వెళ్లాంటే కొన్ని విష‌యాల్లో రాజీప‌డాల్సిందే. ఆ స‌న్నివేశాల్లో ఆమె బాగా న‌టించింది. అందంగా క‌నిపించిన ఆమెకు సొట్ట‌బుగ్గ‌లు మ‌రింత అందాన్నిచ్చాయి. ఆమె స్నేహితురాలిగా న‌టించిన అమ్మాయితోపాటు హీరో స్నేహితుడుగా న‌టించిన‌వారు ఎంట‌ర్‌టైన్ చేశారు. ఎన్‌.ఆర్‌.ఐ. స్నేహితుడు టెన్త్ ఫెయిల్ అయిన వ్య‌క్తిగా న‌టించిన న‌టుడు తీరు కొత్త‌గా అనిపించి వినోదాన్ని పండిస్తుంది. ఇలా ప‌రిమితమైన న‌టీన‌టుల‌తో ప‌రిమిత లొకేష‌న్ల‌లో తీసిన ఈ సినిమా చ‌క్క‌టి సందేశాన్ని ఇచ్చే ప్ర‌య‌త్నం ద‌ర్శ‌కుడు చేశాడు. మ‌హిళ‌కు విలువ ఇవ్వాల‌నే మంచి సినిమా తీసిన నిర్మాత‌ను అభినందించాలి.
 
సంగీత‌ప‌రంగా న‌గేష్ బేక్‌గ్రౌడ్ మ్యూజిక్ బాగుంది. న‌గేశ్ కెమెరా ప‌నితం మెచ్చ‌ద‌గిందే. యుక్త‌వ‌య‌సు లోని అమ్మాయి, అబ్బాయిల మ‌న‌సులు సునిశితంగా ఉంటాయి. అలాంటివారు క‌లిసి చేసే ప్ర‌యాణంలో ఎలాంటి ఒడిదొడుకుల‌ను ఎదుర్కొన్నారనేది సినిమా. ఇందులో అక్క‌డ‌క్క‌డా చిన్న‌పాటి లోపాలున్నా క‌థ ప‌రంగా అవేవి క‌నిపించ‌వు. ముఖ్యంగా సంభాష‌ణ‌లు పొందిక‌గా అనిపించాయి. క‌ట్నం గురించి.. నాట్ రిఫండ‌బుల్ అనే డైలాగ్స్‌లు బాగున్నాయి. మెరిసే మెరిసే చ‌క్క‌టి మూవీ. ప్లెజంట్ మూవీ. థియేట‌ర్లో చూస్తేనే కిక్ వుంటుంది.
రేటింగ్ః 3/5