మంగళవారం, 22 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By dv
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2015 (10:48 IST)

చిరు ఎంట్రీ అదుర్స్... కామెడీ మైనస్ పాయింట్.. రొటీన్‌ కథతో సాగిన బ్రూస్‌లీ...

విడుదల తేదీ : 16 అక్టోబర్‌ 2015
నటీనటులు : రామ్‌ చరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కృతి ఖర్భంద, నదియా.. తదితరులు
సంగీతం : ఎస్‌ఎస్‌ తమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, నిర్మాత : డివివి దానయ్య, దర్శకత్వం : శ్రీను వైట్ల
 
'మగధీర' తర్వాత చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించారన్న అంశం ఫ్యాన్స్‌లో ఎలాంటి క్రేజ్‌ తెచ్చిందో చూడాలనే కుతూహలం 'బ్రూస్‌లీ' చిత్రం రేకెత్తించింది. కామెడీ యాక్షన్‌ ఎంటర్టైనర్స్‌ స్పెషలిస్ట్‌ అయిన శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా కనిపించింది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'బ్రూస్‌లీ' నటించిన ఎంటర్‌దిడ్రాగన్‌ స్ఫూర్తిగా టైటిల్‌ పెట్టారని చిరంజీవి ఆడియోలో చెప్పడం... ఈ చిత్రం దాన్ని రీమేక్‌గా మార్చి తీశారన్న అనుమానం కూడా కలిగింది. మొత్తానికి ఎలా వుందో చూద్దాం.. ఈ చిత్రం రాత్రి... స్పెషల్‌ షో.. ఫ్యాన్స్‌కు వేశారు..
 
కథ :
టైటిల్‌కు తగినట్లే... బ్రూస్‌ లీని రోల్‌ మోడల్‌గా భావిస్తూ చిన్నప్పటి నుంచి ఫైట్లు, ఫీట్లు చేస్తూ పెరుగుతాడు మన హీరో కార్తీక్‌ (రామ్‌ చరణ్‌). అందుకే అందరూ బ్రూస్‌ లీగా పిలుస్తుంటారు కూడా. కార్తీక్‌కు అమ్మ (పవిత్ర లోకేష్‌), నాన్న రామచంద్ర రావు(రావు రమేష్‌), అక్క (కృతి కర్భంద)తో చక్కటి కుటుంబం. వారిని పెంచడంకోసం సినిమాలలో స్టంట్‌ మాస్టర్‌‌గా, సినీ హీరోలకి డూప్‌‌గా పనిచేస్తుంటాడు. అలా ఓసారి పోలీసు డ్రెస్‌లో వున్న కార్తీక్‌ని చూసి... వీడియో గేమ్‌ డెవలపర్‌ రియా (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) ప్రేమలో పడిపోతుంది. ఎప్పటికైన్నా పోలీస్‌‌నే పెళ్లి చేసుకోవాలి అని కలలు కనే అమ్మాయి. 
అలా ఆ పోలీస్‌ పిచ్చిలో తను చేసే కొన్ని పనుల వల్ల సమస్యల్లో పడుతుంది. తనని కాపాడడం కోసం కార్తీక్‌.. దీపక్‌ రాజ్‌ (అరుణ్‌ విజయ్‌) మనుషులను పలు సార్లు కొడతాడు. దాంతో తెలియకుండానే దీపక్‌ రాజ్‌‌తో వైరం పెరుగుతుంది. ఇంకోవైపు పెద్దింటివారైన జయరాజ్‌ (సంపత్‌ రాజ్‌) - వసుంధర (నదియా)లు కృతిని తన ఇంటి కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ టైంలోనే కార్తీక్‌.. ఉరఫ్‌ బ్రూస్‌లీ జీవితంలో  కొన్ని సమస్యలు వస్తాయి. జయరాజ్‌ గురించి కూడా కొన్ని జీర్ణించుకోలేని నిజాలు బయటకి తెలుస్తాయి. దాంతో షాక్‌గురైన కార్తీక్‌... తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏం చేశాడనేదే ఈ చిత్ర కథ. 
 
పెర్‌ఫార్మెన్స్‌...
'మనం'లో అఖిల్‌ క్రెడిట్‌ కొట్టుకుపోయినట్లు.. ఇందులో రామ్‌చరణ్‌ కంటే చిరంజీవి ఎంట్రీతో అంతా క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడనే చెప్పాలి. రఫ్‌ అండ్‌ టఫ్‌ మాస్‌ లుక్‌‌లో కనిపించి అందరినీ థ్రిల్‌ చేశాడు. ఆయన స్క్రీన్‌ ప్రెజన్స్‌, పెర్ఫార్మన్స్‌, స్టంట్స్‌, డైలాగ్స్‌ థియేటర్స్‌‌లో ఉన్న ఆడియన్స్‌‌కి ఒక్కసారిగా 'గ్యాంగ్‌ లీడర్'‌, 'ఖైదీ', 'కొదమ సింహం' రోజులను గుర్తు చేస్తాయి. రామ్‌ చరణ్‌ చాలా రోజుల తర్వాత మళ్ళీ లుక్‌ని మార్చుకొని చేసిన ఈ సినిమాలో చాలా స్టైలిష్‌ గా కనిపించాడు. శ్రీను వైట్ల క్రియేట్‌ చేసిన కార్తీక్‌ పాత్రలో ఓ కొత్త రామ్‌ చరణ్‌ని చూస్తాం. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ మానరిజమ్స్‌, స్టైల్‌, టోటల్‌ డిఫరెంట్‌గా అనిపించే యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌ని కట్టి పడేస్తాయి. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కెరీర్లోనే బెస్ట్‌ స్క్రీన్‌ ప్రెజన్స్‌ బ్రూస్‌ లీలోనే అని చెప్పాలి. ఇప్పటి వరకూ కనిపించిన దానికంటే చాలా క్యూట్‌ గా, చాలా అందంగా, మోస్ట్‌ గ్లామరస్‌ గా కనిపిస్తుంది. సింప్లీ యూత్‌ అయితే వావ్‌ వాట్‌ ఏ బ్యూటీ అంటూ తన మాయలో పడిపోతారు. చరణ్‌ సిస్టర్‌ పాత్రలో కృతి కర్బంధ సరిపోయింది. విలన్‌గా పరిచయం అయిన విజయ్‌కుమార్‌ కొడుకు అరుణ్‌ విజయ్‌ బాగానే చేసాడు. నదియా మరోసారి రిచ్‌ బిజినెస్‌ ఉమెన్‌గా మెప్పించింది. రావు రమేష్‌, పవిత్రా లోకేష్‌, సంపత్‌ రాజ్‌లు మంచి నటనని కనబరిచారు. డైరెక్టర్‌గా జయప్రకాశ్‌ రెడ్డి, హీరోగా బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి కాసేపు నవ్వించారు. 
 
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ పరమహంస తను ఇచ్చిన అవుట్‌ పుట్‌ సింప్లీ సూపర్బ్‌. నటీనటులని సరికొత్తగా చూపించాడు. అలాగే ప్రతి షాట్‌, ప్రతి సీన్‌ చూడటాని ఓ కలర్ఫుల్‌ పెయింటింగ్‌లా ఉంటుంది. విజువల్స్‌ పరంగా తన మ్యూజిక్‌తో ఒక భావాన్ని క్రియేట్‌ చేసిన క్రెడిట్‌ మాత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌కే చెందుతుంది. తమన్‌ అందించిన పాటలు పెద్ద హిట్‌, విజువల్స్‌ పరంగా ఇంకా పెద్ద హిట్‌. ఇక నేపథ్యసంగీతం పరంగా కూడా ప్రతి సీన్‌‌కి న్యాయం చేసాడు. మెయిన్‌‌గా చిరు ఎపిసోడ్‌కి కంపోజ్‌ చేసిన బిట్‌ సాంగ్‌ ఆకట్టుకుంది. ఎడిటర్‌ ఎం.అర్‌ వర్మ ఫర్వాలేదు. ఫైట్‌మాస్టర్స్‌ అనల్‌ అరసు, రామ్‌ లక్ష్మణ్‌, విజయ్‌, కంపోజ్‌ చేసిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ మాస్‌ని ఆకట్టుకుంటాయి. కోన వెంకట్‌ రాసిన కొన్ని డైలాగ్స్‌ బాగానే పేలాయి. కథ, కథనం, దర్శకత్వం అనే విభాగాల విషయానికి వస్తే.. శ్రీను వైట్ల బ్రూస్‌ లీ కోసం అనుకున్న సెంటిమెంట్‌ స్టోరీ లైన్‌ కొత్తదేమీ కాదు, కానీ ఆ కథకి పాత్రలని కొత్తగా రాసుకోవడంలో కొంతమేర సక్సెస్‌ అయ్యాడు. 
 
విశ్లేషణ:
కథ మాత్రం చాలా చాలా పాతది. కోన వెంకట్‌, గోపి మోహన్‌లు కలిసి డెవలప్‌ చేసిన పూర్తి కథ కూడా చాలా ఓల్డ్‌ ఫార్మాట్‌‌లో ఉంది. కథనంలో అన్నా ట్విస్ట్స్‌ రాసుకోవాల్సింది. ఫస్ట్‌ హాఫ్‌ పరంగా బాగానే డీల్‌ చేసుకుంటూ వచ్చి ఉన్న ఒక ట్విస్ట్‌‌ని ఇంటర్వల్‌‌లోనే చెప్పేయడం వల్ల సెకండాఫ్‌లో చెప్పడానికి ఏమీ లేకపోయింది. దాంతో సెకండాఫ్‌ మొత్తాన్ని కామెడీ పెట్టి ఏదో మేనేజ్‌ చేద్దాం అనుకున్నారు, కానీ అది పూర్తిగా ఫెయిల్‌ అయ్యింది. ఒక్క క్లైమాక్స్‌ తప్ప మిగతా సెకండాఫ్‌ మొత్తం బాగా బోరింగ్‌‌గా అనిపిస్తుంది.
 
కామెడీ పెద్దగా లాభంలేదు. మెయిన్‌‌గా శ్రీను వైట్ల సినిమా అంటే కామెడీని ఎక్కువగా ఆశిస్తారు, కానీ ఈ సినిమాలో కామెడీ అనేది చాలా తక్కువ ఉంది. అలాగే శ్రీను వైట్ల అంటే బ్రహ్మానందంతో బాగా నవ్విస్తాడు, కానీ ఇందులో బ్రహ్మానందం కామెడీ అస్సలు వర్కౌట్‌ అవ్వలేదు. ఫస్ట్‌ హాఫ్‌‌లో కూడా కొన్ని బోరింగ్‌ మోమెంట్స్‌ ఉన్నాయి. సెకండాఫ్‌‌‌లో హీరోయిన్‌ పాటల కోసం తప్ప ఇంకెక్కడా పెద్దగా కనిపించదు. అలాగే బాలీవుడ్‌ నుంచి తీసుకొచ్చిన టిసిక చోప్రా చేత చేయించిన పాత్ర చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇలాంటి పాత్రకి ఆమెను ఎందుకు పట్టుకొచ్చారా అనే ఫీలింగ్‌‌ని కూడా కనపడుతుంది. వీటన్నిటికీ మించి హీరో స్ట్రాంగ్‌ అంటే విలన్‌ అంతకన్నా స్ట్రాంగ్‌‌గా ఉండాలి అప్పుడే సినిమాలో మజా వస్తుంది. కానీ అరుణ్‌ విజయ్‌ పాత్రని అంత బాగా డిజైన్‌ చెయ్యలేదు. రెండే రెండు సీన్స్‌‌లో హీరోకి ఎదురుపడి ఒకసారి దెబ్బలు తిని కోమాలోకి, ఇంకోసారి చచ్చిపోతాడు. దీనివల్ల విలనిజం ఎలివేట్‌ కాలేదు. 
 
మొత్తం 155 నిమిషాల రన్‌ టైంలో కనీసం ఒక 15 నిమిషాలు తగ్గించినా సినిమాకి చాలా హెల్ఫ్ అవుతుంది. అలాగే సినిమా ప్రమోషన్స్‌‌లో చెప్పుకుంటూ వచ్చిన సిస్టర్‌ సెంటిమెంట్‌ కూడా పెద్దగా లేకపోవడం మరో మైనస్‌. శ్రీను వైట్ల నుంచి ఆశించిన రొటీన్‌ కథ, కథనాలే తీసుకున్నా  అయినా అభిమానులను, మాస్‌ని మెప్పించే అంశాలు ఎక్కువ పెట్టాడు. సినిమా వేగంగా మొదలవ్వడం, రామ్‌ చరణ్‌ న్యూ క్యారెక్టరైజేషన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాల విందు, ఇంటర్వల్‌ బ్లాక్‌, చిరు గెస్ట్‌ రోల్‌ సినిమాకి హైలైట్స్‌‌గా నిలిస్తే, రోటీన్‌ కథ, కథనం, బోరింగ్‌ సెకండాఫ్‌, ఎంటర్టైన్మెంట్‌ పెద్దగా లేకపోవడం సినిమాకి బిగ్గెస్ట్‌ మైనస్‌ పాయింట్స్‌. మొత్తంగా చూస్తే... పేలవమైన కథకు. కొత్త మెరుగులు దిద్ది ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి. మరి రొటీన్‌ యాక్షన్‌తో వుండే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం ఆదరిస్తారో చూడాల్సిందే...
 
రేటింగ్‌: 2.75/5