శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Modified: శుక్రవారం, 7 డిశెంబరు 2018 (19:00 IST)

ఆసక్తిని రేకెత్తించే సుమంత్, ఈషారెబ్బ 'సుబ్రహ్మణ్యపురం'... రివ్యూ(Video)

సుబ్రహ్మణ్యపురం నటీనటులు : సుమంత్‌, ఈషా రెబ్బా, సాయి కుమార్‌, సురేష్‌, అమిత్‌ శర్మ, భద్రమ్‌ తదితరులు, సాంకేతికత: సినిమాటోగ్రఫర్‌ : ఆర్‌ కె ప్రతాప్‌, సంగీతం : శేఖర్‌ చంద్ర, ఎడిటర్‌ : కార్తికేయ శ్రీనివాస్‌, నిర్మాత : భీరం సుధాకర్‌ రెడ్డి, స్క్రీన్‌ ప్లే దర్శకత్వం : సంతోష్‌ జాగర్లపూడి.
 
'కార్తికేయ' సినిమాకు ఫైనాన్సియర్‌గా వున్న సుధాకర్‌రెడ్డి 'సుబ్రహ్మణ్యపురం' చిత్రాన్ని నిర్మించారు. కుమారస్వామికి చెందిన కథ అయినా దానికీ దీనికి పొంతనేలేదని ముందు నుంచీ చెబుతున్నారు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్‌, ఈషా రెబ్బా హీరోహీరోయిన్లుగా శేఖర్‌ చంద్ర సంగీత సారథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. అదెలా వుందో చూద్దాం.
 
కథ :
నాస్తికుడైన సుమంత్‌ పురాతన దేవాలయాల పరిశోధకుడు. అతనికి ముగ్గురు స్నేహితులు. అందులో ఒకర్ని చెల్లెల్లిగా చూసుకుంటాడు. ఆమె స్నేహితురాలు ఈషా రెబ్బా పమర భక్తురాలు. ఆమెను తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. వేసవిలో అంతా కలిసి ఈషా గ్రామమైన సుబ్రహ్మణ్యపురం వస్తారు. అప్పటికే గ్రామంలో ఊహించని రీతిలో ఆత్మహత్యలు జరుగుతుంటాయి. దీనికి కారణం సుబ్రహ్మణ్యస్వామి దేవుడేనని, ఆగ్రహించి దేవుడే చంపేస్తున్నాడని గ్రామస్తుల మూఢనమ్మకం. ఆ తర్వాత తిరిగి వచ్చిన సుమంత్‌.. కొద్ది కాలానికి మరలా సుబ్రహ్మణ్యపురం రావాల్సి వస్తుంది. అలాగే ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఇందులో ఏదో మర్మం వుందని భావిస్తాడు. చివరికి తను చెల్లెలుగా చూసుకున్న అమ్మాయి చనిపోవడంతో సుమంత్‌ ఆ ఆత్మహత్యల్ని శోధించే పనిని వేగతరం చేస్తాడు. ఆ క్రమంలో ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. అది ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
నాస్తికుడిగా దేవాలయాల పరిశోధకుడిగా కనిపించిన సుమంత్‌ ఈజీగా పాత్రను పోషించేశాడు. హీరోయిన్‌తో ప్రేమ సన్నివేశాలు ఇంట్రెస్ట్‌గా అనిపిస్తాయి. అలాగే సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న ఆత్మహత్యల రహస్యాన్ని చేధించే సన్నివేశాల్లో కూడా సుమంత్‌ తన సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఈషా రెబ్బా ఎప్పటిలాగే తన స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో పాటుగా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. 
 
ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది. డాక్టర్‌గా సాయి కుమార్‌ తన గాంభీరమైన నటనతో మెప్పించారు. గ్రామ పెద్దగా నటించిన సురేష్‌ మెప్పించాడు. ఇక కమెడియన్‌ భద్రమ్‌ తన కామెడీ టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేయగా.. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. 
 
దర్శకుడు సంతోష్‌ ఎంచుకున్న పాయింట్‌ ఆసక్తికరమే. వందల ఏళ్ళ క్రితం ఆకాశంలోంచి పడిన గ్రహశకలం సుబ్రహ్మణ్యస్వామి ఆకారంలో వుండడంతో దాన్ని రాజు రవివర్మ ఆలయం కట్టడం, ఊరుగా మారడం వంటి విషయాలు ఆసక్తికరంగా వున్నాయి. దానితోపాటు నెమలి కన్పించడం, కన్పించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వంటివి ఇంట్రెస్ట్‌ కల్గిస్తాయి. ఆత్మహత్యల తాలూకు సన్నివేశాలు కూడా ఆయన ఆకట్టుకునే విధంగా మలిచారు. వీటి ముగింపు కూడా బాగున్నా.. దేని కోసం ఇంతలా గ్రామస్తుల్ని చంపాల్సివస్తుందనే పాయింట్‌ చివర్లో స్పష్టత ఇవ్వలేకపోయాడు దర్శకుడు. విగ్రహం కోసం కొందరు ఇదంతా చేస్తున్నారని చెప్పినా దాని ప్రత్యేకత ఏమిటో ఇంకా వివరిస్తే బాగుండేది. 
 
ఇక కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు. కథలోని మెయిన్‌ ఎమోషన్‌ ఇంకా బలంగా ఎలివేట్‌ అవకాశం ఉన్నట్లు అనిపించడం, సుబ్రహ్మణ్యపురంలో ఆత్మహత్యలు జరగడానికి బలమైన కారణాలను అంతే బలంగా చూపించపోవడం వంటి అంశాలు సినిమా డ్రా‌బ్యాక్స్‌గా నిలుస్తాయి.
 
దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి మంచి కాన్సెప్ట్‌ తీసుకున్నారు. అయితే పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోకపోయినా, సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న ఆత్మహత్యల తాలూకు సన్నివేశాలతో ఆయన సినిమాని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశారు. ఆర్‌ కె ప్రతాప్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు.
 
సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. సెకండాఫ్‌లో కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం కొంతమేరకు ఆకట్టుకుంటుంది. కార్తికేయ శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ సినిమాకి తగ్గట్లే ఉంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బాగున్నాయి. థ్రిల్‌, సస్పెన్స్‌ను ఆశించే ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది.
- పి. మురళీకృష్ణ
తెలుగమ్మాయి ఈషా రెబ్బ ఇంటర్వ్యూ చూడండి