బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. అడ్రస్ డైరీ
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (22:44 IST)

విల‌న్ పాత్ర వ‌ల్లే సామ‌ర్థ్యం తెలుస్తుందిః లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi
`న‌టీన‌టుల‌కు చాలెంజింగ్ పాత్ర‌లు విలన్‌ పాత్రలే. అవి నాకు చాలా ఇష్టం. ఆ తరహా పాత్రలు చేస్తేనే నటిగా మన సామర్థ్యం తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని స్క్రిప్టులు విన్నా. పాత్రలను బట్టి సినిమాలు ఎంపిక చేసుకుంటాను` అని లావణ్య త్రిపాఠి చెబుతోంది. ఇటీవ‌లే చావుక‌బురు చ‌ల్ల‌గా సినిమాలో న‌టించింది. దానికి ముందుగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చేసింది. మార్చి 5న విడుదల కానున్న ఈ చిత్ర  విశేషాలను ఆమె ఇలా తెలియ‌జేస్తుంది.
 
- నేను మొదటి నుంచి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడం వల్ల పాత్రకు తగ్గట్టు కొన్ని కొన్ని వర్కౌట్లు మాత్రమే చేశా. అలాగే నా స్కూల్‌డేస్‌లో బాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌ ఆడేదాన్ని. హాకీ స్కూల్లో ఉండేది కాదు. కానీ, ఈ సినిమా చేసిన తర్వాత హాకీ కచ్చితంగా స్కూల్‌ గేమ్స్‌లో ఉండాలనిపించింది. అలాగే హాకీ క్రీడాకారుల బాడీలాంగ్వేజ్‌ ఎలా ఉండాలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. చెన్నైలో కోచ్‌ సుధీర్‌గారు నాకు శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్‌ని బాగా ఎంజాయ్‌ చేశా.
 
- రెగ్యులర్‌ పాత్రల్లో నటించి బోర్‌ కొట్టింది. అందుకే ఏదైనా ఛాలెంజింగ్‌ పాత్రలో నటించాలనే ఉద్దేశంతో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రం చేశా. ఈ చిత్రం తమిళ రీమేక్‌ అయినప్పటికి 50శాతం అసలు కథలో మార్పులు చేసి తెలుగులో తెరకెక్కించారు. అలాగే ఇందులోని పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉండటంతో సులభంగా పాత్రలోకి ఒదిగిపోయా.
 
- ఈ సినిమా హాకీ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి మ్యాచ్‌లో భావోద్వేగాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అందుకోసం పాత హాకీ మ్యాచ్‌లు ఎక్కువగా చూసేదాన్ని. సందీప్‌, నేనూ రెగ్యులర్‌ హీరో, హీరోయిన్‌ పాత్రల్లో  నటించలేదు. ఒక హాకీ ప్లేయర్స్‌ ఎలా ప్రవర్తిస్తారో అలాగే చేశాం. కొన్ని సాంగ్స్‌లో గ్లామర్‌గా చేసినప్పటికీ ఆ ప్రభావం సినిమాపై పడకుండా జాగ్రత్తలు. ఎందుకంటే ఇందులో నా పాత్రకు పెద్దగా మేకప్‌ ఉండదు.
 
- క్రీడా సినిమా అంటేనే రాజ‌కీయాలుంటాయి. ఆటకు అవి ప్రతిబంధకంగా మారతాయి. ఎంతో మంది ప్రతిభావంతులు ఈ రాజకీయాల వల్ల నష్టపోతుంటారు. వాటన్నింటినీ చిత్రంలో సందేశాత్మకంగా చూపించాం. మా లవ్‌ ట్రాక్‌ కూడా అలరిస్తుంది.
 
- ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ సినిమాలకు కమిట్‌ అవ్వలేదు. కారణం అన్నీ అంతకు ముందు నేను చేసిన పాత్రల్లానే ఉన్నాయి. కేవలం ఒక డైలాగ్‌ చెప్పేసి, ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చేస్తే సరిపోదు కదా. ఒక పాత్రకోసం శారీరకంగా కూడా కష్టపడాలి. అందుకే హాకీ బ్యాట్‌ పట్టి మైదానంలో చెమటలు చిందించాను. ఆ సమయంలో ఎంతో తృప్తిగా అనిపించేది.
 
- సందీప్‌తో నాకు ఎప్పటినుంచో పరిచయముంది. ఇద్దరం కలిసి ‘మాయావన్‌’లో నటించాం. ఈ చిత్ర నిర్మాతల్లో సందీప్‌ కూడా ఒకరు. అందుకే నాకేమైనా సమస్యలున్న అతనితో చర్చించేదాన్ని. నా మాటకు ఎంతో విలువనిస్తాడు. సందీప్‌ మంచి సహనటుడు కూడా. ‘మాయవన్‌’చిత్రంలో మా ఇద్దరి మధ్య పెద్దగా లవ్‌ ట్రాక్‌ ఉండదు. ఇందులో ఆ లోటు తీర్చాం. ఈ చిత్రం కోసం బైక్‌ నడపడం కూడా నేర్చుకున్నా.