శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మే 2020 (20:47 IST)

#AthamaNirbharaBharath పేరుతో ప్యాకేజీ - లాక్డౌన్‌పై 18వ తేదీలోపు క్లారిటీ ఇస్తాం...

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే నిమిత్తం కేంద్రం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్డౌన్‌ను అమలు చేస్తోంది. ఇది ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి మరోమారు జాతినుద్దేశించి ప్రసంగించారు. 
 
ఇందులో కరోనా వైరస్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు వీలుగా రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఆత్మ్ నిర్భర్ భారత్ పేరుతో ఈ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. 21వ శతాబ్దం భారత్‌దేనని, ఈ ప్యాకేజి అండగా మన దేశం మున్ముందు కూడా మరింత మెరుగైన ఆర్థిక పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
 
మరోవైపు, కరోనా వైరస్‌పై ప్రపంచం గత నాలుగు నెలలుగా యుద్ధం చేస్తోందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా శక్తివంచన లేకుండా శ్రమిస్తోందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వీలుగా, ప్రతి ఒక్కరినీ ఆదుకునే చర్యల్లో భాగంగా, ఆత్మ్ నిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించినట్టు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే ఈ ప్యాకేజీ అంటూ ప్రకటించారు. ఇది దేశ జీడీపీలో 10 శాతం అని గుర్తుచేశారు. 
 
ఈ మొత్తాన్ని ప్రధానంగా వ్యవసాయం, కార్మికులు, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలపై వెచ్చించనున్నామని, దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడిస్తారని మోడీ వెల్లడించారు. విపత్తును కూడా భారత్ అవకాశంగా మల్చుకుంటుందని తెలిపారు. ఇప్పుడు భారత్ పురోగతే ప్రపంచ పురోగతిగా మారిందని వివరించారు.