సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మే 2020 (13:44 IST)

లాక్డౌన్‌పై నేడు కీలక ప్రకటన - రాత్రి 8 గంటలకు ప్రధాని ప్రసంగం

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా, ప్రస్తుతం అమలవుతున్న లాక్డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొనివుంది. అదేసమయంలో కరోనా కట్టడితో పాటు.. లాక్డౌన్ అంశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ప్రధాని మోడీ స్వీకరించారు. వారిచ్చిన సమాచారంతో పాటు.. నిపుణులు ఇచ్చిన సూచనలు, సలహాలను క్రోఢీకరించిన ప్రధాని మోడీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 
 
అదేసమయంలో 17వ తేదీతో ముగియనున్న లాక్డౌన్‌ను పొడగించాలా? వద్దా? లేక లాక్డౌన్ ఆంక్షలను సడలించాలా? అనే అంశంపై ప్రధాని మోడీ మంగళవారం రాత్రి కీలక ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. లాక్డౌన్‌ సడలింపులు, కరోనా కట్టడి చర్యలపై ఆయన ప్రసంగించనున్నారు.
 
కాగా, తొలి దశ లాక్డౌన్‌లో తీసుకున్న పలు చర్యలు రెండో దశలో తీసుకునే అవసరం లేదని, అలాగే, రెండో దశలో తీసుకున్న పలు చర్యలను మూడో దశలో తీసుకోలేదని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశలో తీసుకునే అవసరం లేదని మోడీ స్పష్టంచేశారు. దీంతో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
లాక్డౌన్ 4.O సంకేతాలు...? 
లాక్డౌన్‌ను పొడగించాలా? వద్దా? అనే అంశంపై ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వారి అభిప్రాయాలను సేకరించారు. మరోవైపు, దేశంలో ప్రతి రోజూ దాదాపుగా మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థుల్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ ఎత్తివేయడం సరికాదని పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడగా, వారితో ప్రధాని కూడా ఏకీభవించినట్టు సమాచారం. పైగా, ఆయన లాక్డౌన్ 4.Oకు సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. 
 
అంతేకుండా, దేశంలో రైళ్ళ రాకపోకల పునరుద్ధరణను కూడా పలువురు సీఎంలు వ్యతిరేకించారు. ముఖ్యంగా, తెలంగాణ, బీహార్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే రైళ్ల పునరుద్ధరణకు ససేమిరా అన్నారు. ఇలా అన్ని కోణాల్లో సమాచారాన్ని బేరీజు వేసిన తర్వాత ప్రధాని మోడీ సైతం మే నెలాఖరు వరకు లాక్డౌన్ పొడగింపునకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.