శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (10:53 IST)

ఏ క్షణమైనా అయోధ్య తీర్పు... యూపీ సీఎస్ - డీజీపీలకు చీఫ్ జస్టీస్ పిలుపు

వివాదాస్పద అయోధ్య కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు ఏ క్షణమైనా వెలువరించే అవకాశం ఉంది. వీటిని రుజువు చేసేలా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను తన ఛాంబర్‌కు రావాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ ఆదేశించారు. దీంతో వీరిద్దరూ శుక్రవారం మధ్యాహ్నం చీఫ్ జస్టీస్‌తో సమావేశంకానున్నారు. 
 
ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్‌పై ఆయన చర్చించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మధ్యాహ్నం చీఫ్ జస్టిస్ ఛాంబరులో రంజన్ గొగోయ్ ను యూపీ చీఫ్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ తివారీ, డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్ కలవనున్నారు.
 
కాగా, ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు వచ్చే వారం 15వ తేదీకి ముందే అయోధ్య తుది తీర్పును సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం వెలువరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నెల 15వ తేదీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చివరి పని దినం కావడం గమనార్హం. 17వ తేదీన ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో ఈలోగానే తుది తీర్పును వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, అయోధ్య తీర్పు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పలు కళాశాలలను ఇప్పటికే తాత్కాలిక జైళ్లుగా మార్చేశారు. అలాగే, అయోధ్య, లక్నోలలో రెండు హెలికాప్టర్లను స్టాండ్ బైగా ఉంచారు. ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడితే వీటిని ఉపయోగిస్తారు. 
 
సోషల్ మీడియాపై నిఘా ఉంచాలని పోలీసులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. రెచ్చగొట్టే విషయాలను ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు. అలజడి సృష్టించేందుకు ఎవరైనా యత్నిస్తే... వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామని పోలీసులు హెచ్చరించారు.