ఈ రాత్రి నీ భార్యను వదులుతానా అని పోలీసులు బెదిరించారు, పోలీసులు ఏమంటున్నారు?
బంజారా హిల్స్ పోలీసులపై ఓ జంట తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఓ వీడియోను సోషల్ నెట్విర్కింగ్ సైట్లలో షేర్ చేసి వైరల్ చేశాయి. ఆ వీడియోలో జంట పోలీసులపై దారుణమైన ఆరోపణలు చేసింది. వీడియోలో భార్యాభర్త ఇద్దరూ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ... '' డిసెంబర్ 3న పిటీషన్ ఇచ్చేందుకు వెళ్లాను. నన్ను ఓ పోలీసు అధికారి ఇది ఒక ప్రొస్టిట్యూట్ అని అన్నారు. సీపీ గారికి కాల్ చేస్తే, వెంటనే ఆఫీసుకి రమ్మని అన్నారు. మరో పోలీసు అధికారి అక్కడికి వెళ్లొద్దని చెప్పి ఆపారు.
ఆ తర్వాత మమ్మల్ని సీసీ కెమేరాలు లేని ప్రదేశాలకు తీసుకుని వెళ్లారు. నా పట్ల అసభ్యంగా బిహేవ్ చేశారు. నా భర్తను దారుణంగా కొట్టారు. షేర్ చేసుకోలేని విషయాలు చాలా వున్నాయి. అవన్నీ నా భర్త చెప్తారు" అని చెప్పింది. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ... "మేము పిటీషన్ ఇవ్వడానికి వెళ్తే మా పట్ల బంజారా హిల్స్ పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. సీసీ కెమేరాలు లేని పైఅంతస్తులోకి తీసుకుని వెళ్లి మా ఇద్దరినీ కొట్టారు. మా సెల్ ఫోన్లు లాక్కున్నారు. ఆ రోజు టీవీలో మ్యాచ్ వస్తుంటే, మ్యాచ్ చూస్తే బౌండరీ మిస్ అయినప్పుడల్లా అరెరే బౌండరీ మిస్ అయ్యిందంటూ లాఠీలతో కొట్టారు.
నా పై నుంచి నా భార్య మీదికి ఎక్కి డ్యాన్స్ చేశారు. రాత్రివేళ నా భార్యను మహిళా పోలీసులు తీసుకుని వెళ్తుంటే, ఆమె నన్ను విడిచి వెళ్లేందుకు నిరాకరించింది. అప్పుడు ఓ పోలీసు అధికారి, ఇంత అర్థరాత్రి వేళ నీ భార్యను నేను వదులుతానా అని బెదిరించారు. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని చంచల్ గూడ జైలుకు పంపారు. బెయిల్ పైన బయటకు వచ్చాము. బంజారా హిల్స్ పోలీసులు నా భార్యపై అత్యాచార యత్నం చేశారు. ఇవన్నీ చెప్తున్నామనిమాకోసం వెతుకుతున్నారు. మాకు ప్రాణహాని వుంది. రక్షించండి'' అంటూ చెప్పాడు.
పోలీసులు ఏమంటున్నారు?
వీరి ఆరోపణలపై డీసీపి స్పందించారు. ఆయన మాట్లాడుతూ... '' మా పోలీసులపై ఆ జంట విపరీతమైన అభియోగం చేసింది. వారికి సివిల్ ఇష్యూలు వున్నాయి. వారు చెప్పే మాటల్లో సత్యం లేదు, పచ్చి అబద్ధాలు అని తేలింది. మాపై ఆరోపణలు చేస్తున్న అట్లూరి సురేష్ కుమార్‌కి వాసుదేవ్ శర్మ అనే వ్యక్తితో ఆర్థికపరమైన విభేదాలున్నాయి.
సురేష్ 4 లక్షల 70 వేల రూపాయలు శర్మ నుంచి తీసుకుని వున్నారు. నెల రోజుల్లో ఇస్తామని చెప్పారు. వాసుదేవ్ రిటర్న్ ఇవ్వమని అడిగారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరించారు. వాసుదేవ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ పిటీషన్లు పరిశీలించి, సివిల్ మేటర్ కోర్టు ద్వారా తేల్చుకోమని చెప్పాం. అయినా వినకుండా ఏదో పిటీషన్లను పెట్టేందుకు అతడు తన భార్యను తీసుకుని పోలీసు స్టేషనుకు వచ్చేవారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించేవారు. పోలీసు సిబ్బందికి ఇబ్బందికి కలుగజేశారు. అది సివిల్ మేటర్, ఈ విషయంపై పోలీసు స్టేషనుకి రావద్దని చెప్పినా వినకుండా సమస్యలు కలుగజేశారు.
ఈ క్రమంలో ఎస్సై కాలర్ పట్టుకున్నారు. డిసెంబర్ 8న ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 3 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో వున్నారు. ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చి పోలీసులపై కక్ష సాధింపు చర్యగా ఈ వీడియోను వైరల్ చేశారు. నీచమైన పనులకు పాల్పడవద్దని హెచ్చరిస్తున్నాం. వీళ్లపైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. మానసికంగా తేడా వుంటేనే అలాంటి ఆరోపణలు చేస్తారు.
వీరిపైన జూబ్లిహిల్స్ పోలీసు స్టేషనులో మరో కేసు వుంది. అక్కడ ఇంటి యజమానిని బెదిరించి ఇబ్బంది పెట్టినట్లు కేసు నమోదు అయ్యింది. అతడి మనస్తత్వం తెలిసి కౌన్సిల్ చేసినా మారలేదని వారు చెపుతున్నారు. నోరు ఉంది కదా అని మాట్లాడుతున్నారు. మహిళలకు భద్రత కల్పించడమే మా బాధ్యత. పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించిన వీడియోలు మా దగ్గర వున్నాయి. అవి కూడా బయటపెడతాము.
వాళ్లకు ఏదో ఆవేదన వుంది కదా అని అవన్నీ మాపై చూపుతుంటారు. అవన్నీ భరిస్తుంటాం. ఆధారాలు వారి వద్ద వుంటే చూపించమని అడుగుతున్నాం. అసు సివిల్ కేసుకి సంబంధించి మహిళను పోలీసు స్టేషనుకి తీసుకు రావాల్సిన అవసరం లేదు. అలా తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పినా అతడు వినలేదు. వారిపై చర్యలు తీసుకుంటాం'' అని చెప్పారు.