శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్
Last Modified: బుధవారం, 30 జనవరి 2019 (14:28 IST)

మంచుగడ్డలా మారిన అమెరికా.... -20 డిగ్రీల ఉష్ణోగ్రతలో 2.5 కోట్ల మంది...

అమెరికాలో చలి తీవ్రత ప్రమాదకర స్థాయికి పెరిగిపోయింది. మంచు అధికంగా కురుస్తుండటం మరియు ఆర్కిటిక్ నుండి వీస్తున్న చలిగాలుల కారణంగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే కిందకు పడిపోయాయి. తొమ్మిది కోట్ల మంది ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు మొత్తం మంచుతో కూరుకుపోయాయి. 
 
విస్కాన్సిన్ ప్రాంతంలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలు -20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో జీవిస్తున్నారని అమెరికా జాతీయ వాతావరణ సేవల సంస్థ వెల్లడించింది. ఉత్తర మిన్నెసోటా, డకోటాల్లో - 50 డిగ్రీలు ఉండడంతో ఇల్లీనాయిస్, డెట్రాయిట్, షికాగో, గ్రేట్ లేక్స్, మిన్నెపోలీస్ తదితర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
తీవ్రమైన హిమపాతం కారణంగా అమెరికాలో పలు సేవలకు అంతరాయం కలిగింది. దాదాపు 1,000 విమానాలను రద్దు చేసారు. పాఠశాలలు మూతపడ్డాయి. పోస్టల్ సర్వీసులు నిలిచిపోయాయి. యునివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌‌, యునివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటాలలో తరగతులను రద్దు చేసారు. 1985 జనవరి 20వ తేదీన షికాగోలో -27 డిగ్రీలు నమోదు కాగా, తాజాగా -29 డిగ్రీల వరకు చలి నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.