గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (11:13 IST)

ట్రంప్ కొలువులో ముగ్గురు భారతీయులకు కీలక పదవులు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొలువులో మరోమారు ప్రవాస భారతీయులకు కీలక పదవులు దక్కాయి. వీరిలో అణుశక్తి నిపుణురాలైన రీటా బరన్వాల్ అనే మహిళ కూడా ఉన్నారు. రీటా బరన్వాల్‌ను అమెరికా అణుశక్తి విభాగ అసిస్టెంట్ సెక్రెటరీగా నామినేట్ చేసిన ట్రంప్.. ఆదిత్య బంజాయ్‌ని పౌర హక్కుల పర్యవేక్షక బోర్డు సభ్యునిగా, బిమల్ పటేల్‌ను ఆర్థికశాఖ అసిస్టెంట్ సెక్రెటరీగా నామినేట్ చేశారు. 
 
ఈ ఇండో-అమెరికన్ల నామినేషన్లను బుధవారం అమెరికా సెనేట్‌కు పంపారు. ఇప్పటివరకు ట్రంప్ 36 మందికిపైగా ఇండియన్-అమెరికన్లను కీలక పదవుల్లో నియమించారు. అణుశక్తి విభాగ సహాయ కార్యదర్శిగా నామినేట్ అయిన రీటా బరన్వాల్.. ప్రస్తుతం గెయిన్ (గేట్‌వే ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ ఇనిషియేటివ్) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
బరన్వాల్ నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపితే అమెరికా అణుశక్తి విభాగంలో ఆమె శక్తిమంతమైన పదవిని చేపట్టడంతోపాటు న్యూక్లియర్ టెక్నాలజీ రిసెర్చ్, న్యూక్లియర్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాలకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు యేల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన ఆదిత్య బంజాయ్.. అమెరికా న్యాయశాఖ లీగల్ కౌన్సెల్ కార్యాలయంలో అటార్నీ అడ్వైజర్‌గా పనిచేశారు. ప్రస్తుతం విద్యాబోధన చేస్తున్నారు. అలాగే బిమల్ పటేల్ ప్రస్తుతం అమెరికా ఆర్థికశాఖలోని ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్‌సైట్ కౌన్సిల్‌కు డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీగా పనిచేస్తున్నారు.