శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (11:57 IST)

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇక మహిళలకు ప్రవేశం: సుప్రీం

సుప్రీం కోర్టు ఈ మధ్య సంచలన తీర్పులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మొన్నటికి మొన్న ఆధార్ కార్డులపై, నిన్నటికి నిన్న భార్య చరాస్తి కాదని తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు.. నేడు సుప్రసిద్ధ దేవాలయం శబరిమలలో మహి

సుప్రీం కోర్టు ఈ మధ్య సంచలన తీర్పులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మొన్నటికి మొన్న ఆధార్ కార్డులపై, నిన్నటికి నిన్న భార్య చరాస్తి కాదని తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు.. నేడు సుప్రసిద్ధ దేవాలయం శబరిమలలో మహిళల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆధార్ కార్డులు దేనికి అవసరమో, దేనికి అనవసరమో చూసుకోవాలని కేంద్రానికి సూచన చేసింది. 
 
ఇక గురువారం.. స్త్రీ పురుషులిద్దరు ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధం నేరం కాదని భార్య చరాస్తి కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేరళ శబరిమలలో మహిళలకు ప్రవేశాన్ని అనుమతించవచ్చునని పేర్కొంటూ సంచలన తీర్పు నిచ్చింది. 
 
మహిళల భక్తికి అయ్యప్పను దూరం చేయరాదని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతేగాకుండా.. నెలసరి సాకుగా ఆలయ ప్రవేశం నిషిద్ధమనడం.. రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం తెలిపింది. మిగిలిన అయ్యప్ప ఆలయాలకు లేని ఆంక్షలు శబరిమలలో ఎందుకని న్యాయస్థానం ప్రశ్నించింది. భారత రాజ్యాంగంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉన్నాయన్న విషయాన్ని మరువరాదని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. 
 
కానీ పశ్చిమ కనుమల పర్వతంలోని అయ్యప్ప ఆలయాన్ని స్త్రీలు దర్శించుకునేందుకు వీలుగా మౌలిక ఏర్పాట్లు లేవని.. పంబా నదిని దాటుకుని.. అడవుల్లో స్వామిని దర్శించుకునేందుకు కొందరు మహిళల దేహబలం సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే చాలామంది శబరిమలలోని స్వామిని దర్శించుకోవడం మహిళల తరం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. మహిళా సంఘాలు సుప్రీం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.