భారత్‌కు బాసటగా నిలిచిన జపాన్ - విమాన వాహక నౌకలు మొహరించిన అమెరికా
భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా బలగాలు దొంగచాటుగా దాడి చేసి 20 మంది భారత జవాన్ల ప్రాణాలు తీశాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఫలితంగా ఇరు దేశాలు సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలు మొహరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్‌కు జపాన్ బాసటగా నిలిచింది. వాస్తవ నియంత్రణ రేఖను మార్చే ఎలాంటి ఏకపక్ష ప్రయత్నాన్ని అయినా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
ఇటీవల గాల్వన్ లోయ వద్ద జరిగిన పరిణామాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా జపాన్ రాయబారి సతోషి సుజుకీకి ఫోన్ ద్వారా వివరించారు.
ఆ తర్వాత సుజుకీ ఈ అంశంపై స్పందిస్తూ, భారత్ - చైనా ఈ వివాదాన్ని చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్న భారత్ విధానాలను జపాన్ ప్రశంసిస్తోందని తెలిపారు.
మరోవైపు, ఓవైపు కరోనాతో పోరాడుతూనే మరోవైపు చైనాపై ఓ కన్నేసి ఉంచిన అగ్రరాజ్యం అమెరికా తాజాగా తన విమాన వాహక నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది.
యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్, యూఎస్ఎస్ నిమిట్జ్ విమాన వాహక నౌకలు, మరో నాలుగు యుద్ధ నౌకలు శనివారం నుంచి దక్షిణ చైనా సముద్రంలోనే ఉన్నాయని అమెరికా రక్షణ వర్గాలను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది.
ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం అమెరికా కట్టుబడి ఉందని తన మిత్రపక్షాలకు చాటిచెప్పడమే ఈ మోహరింపుల వెనుక ప్రధాన ఉద్దేశమని రియర్ అడ్మిరల్ జార్జ్ ఎం వికోఫ్ పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.