శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2020
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (15:28 IST)

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్.. ఆ రంగానికి అధిక కేటాయింపులు..?

ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌లో ఎక్కువ భాగం రక్షణ శాఖకు కేటాయించే అవకాశం వుందని వార్తలు వస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. సైన్యం తదితర విభాగాలకు అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని.. ఆ రంగానికి అధిక మొత్తాన్ని కేటాయించే అవకాశం వుందని తెలుస్తోంది. సరిహద్దు రక్షణ, భారత సైనికులు దళాల అవసరాల నిమిత్తం అవసరమైతే బడ్జెట్‌ను మరింత పెంచే దిశగా కేంద్రం ఆలోచన చేస్తోంది.
 
అలాగే దేశం కోసం అలుపెరుగకుండా సేవలందిస్తున్న సైన్యానికి వారి డిమాండ్లపైనా సానుకూలంగా స్పందించబోతున్నారు. ఏ దేశానికైనా రక్షణ వ్యవస్థ అనేది అత్యంత కీలకమైన వ్యవహారం కాబట్టి ఏ రంగానికి కేటాయింపులు ఉన్నా లేకపోయినా బడ్జెట్‌లు రక్షణ రంగానికి ఎప్పుడు పెద్ద పీటే వేయాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నా.. గత కొంతకాలంగా రక్షణ రంగానికి కొంత బడ్జెట్ తగ్గుతూ వస్తోంది. 
 
శత్రు దేశాలకు ధీటుగా నిలబడాలంటే భారత్ అత్యంత ఆధునిక ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాయాది దేశమైన పాకిస్థాన్ మనకంటే చిన్న దేశమైనా.. ఆ దేశ బడ్జెట్‌లో అత్యధిక శాతం రక్షణ రంగానికి కేటాయిస్తోంది. 
 
మిగతా దేశాలకు ధీటుగా అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు కలిగి ఉంది. కానీ భారత్లో మాత్రం ఇంకా కాలం చెల్లిన విమానాలతో నెట్టుకొస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో రక్షణ రంగానికి ప్రత్యేక కేటాయింపులు చేసే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.