వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు మొండిచేయేనా?

income tax
ఠాగూర్| Last Updated: సోమవారం, 27 జనవరి 2020 (17:34 IST)
ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఈ బడ్జెట్ వస్తుందంటే చాలు... వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులు గంపెడు ఆశలు పెట్టుకునివుంటారు. కానీ, ఈ దఫా మాత్రం అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు ఇప్పటికే సంకేతాలు పంపించాయి.

కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గించినట్టుగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చే బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు తగ్గించడమో లేదా పన్ను మినహాయింపులు పెంచడమో చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, ఆర్థిక మందగమనంతో ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్లు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్ల వరకు తగ్గే అవకాశం ఉందని అధికారవర్గాల అంచనావేశాయి.

పైగా, గత యేడాది సెప్టెంబరులో ప్రకటించిన కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు రూ.1.5 లక్షల కోట్ల వరకు గండి పడనుంది. జీఎస్టీ వసూళ్లు మందగించడంతో మరో రూ.50,000 కోట్లకు ప్రభావం పడుతుందని అంచనావేస్తున్నారు. దీంతో వచ్చే బడ్జెట్‌పై వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు పెద్దగా ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే, ఆర్థిక మందగమనం దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఏ రంగం చూసినా డిమాండ్‌ లేక ఉసూరుమంటోంది. కంపెనీల ఉత్పాదక సామర్థ్య వినియోగం 70 శాతానికి మించి లేదు. వినియోగదారుల పొదుపుతో ఉత్పత్తి అయిన సరుకులూ అమ్ముడుపోవడం లేదు. దీంతో కీలకమైన ప్రైవేట్‌ పెట్టుబడులూ అడుగంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు తగ్గించేందుకు ఆర్థిక మంత్రి సీతారామన్‌ పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చన్నది మార్కెట్‌వ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి.దీనిపై మరింత చదవండి :