శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (12:00 IST)

పరకాల వ్యాఖ్యలు.. భర్త విమర్శలపై స్పందించిన నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దేశ ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని, కానీ కేంద్రం మాత్రం దీన్ని అంగీకరించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను పరకాల ఈ సందర్భంగా తప్పుబట్టారు. 
 
ఎన్నో రంగాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయనే విషయాన్ని పబ్లిక్ డొమైన్ డేటా చెబుతోందన్నారు. కానీ ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వంలోని మేధావులు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరని వెల్లడించారు. మన ఆర్థిక పరిస్థితి మళ్లీ గాడిలో పడాలంటే. మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు మన్మోహన్ సింగ్‌ల ఎకనామిక్ మోడల్‌ను అనుసరించాలని సూచించారు. 
 
పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో, తన భర్త చేసిన విమర్శలపై నిర్మలా సీతారామన్ స్పందించారు. పన్నులకు సంబంధించి ఎన్నో సంస్కరణలు చేశామని చెప్పారు. 
 
అక్టోబర్ 1 తర్వాత స్టార్టప్ కంపెనీలు తక్కువ పన్నులు మాత్రమే కట్టేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన చర్యలన్నీ ప్రశంసించదగ్గవేనని చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంస్థాగత సంస్కరణలను చేపట్టిందని వెల్లడించారు. 
 
జీఎస్టీ, వంట గ్యాస్, ఆధార్ తదితర అంశాలకు సంబంధించి తాము ఎన్నో చేశామని. ఇవన్నీ దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేవేనని ఎత్తి చూపారు.  జీఎస్టీని కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదని గుర్తుచేశారు. ఉజ్వల పథకంతో ఎనిమిది లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని గుర్తు చేశారు.