తమలపాకుల మొక్కను ఇంట్లో పెంచటం మంచిదా కాదా? (video)
ఈశాన్యం భాగం ఈక బరువును కూడా మోయ కూడదు అంటారు వాస్తు నిపుణులు. అంటే అంత తక్కువ బరువు కూడా ఆ దిశలో వుంచకూడదని అర్థం. అరటి చెట్టును దక్షిణ దిశలోనే వేసుకోవాలి. కొబ్బరిచెట్టు నైరుతీ దిశలో పెంచాలి. వీలుకాకపోతే ఆగ్నేయం, వాయవ్యంలో పెంచటం ఇబ్బందికరం కాదు. బాదం చెట్టును ఇంటి ఎదురుగా పెంచకూడదు. తమలపాకుల మొక్కను ఇంట్లో పెంచటం లక్ష్మీ ప్రదం. దక్షిణ దిశ ఈ మొక్కకు శుభం.
పూలకోసం పూల మొక్కల్ని కుండీల్లో పెంచుకునేవారు కుండీల్ని ఇంటికి దక్షిణంలో, పడమర, నైరుతి, ఆగ్నేయం, వాయవ్యంలో వుంచవచ్చు. తూర్పు, ఉత్తరం, ఈశాన్యాలలో కుండీలను ఉంచరాదు. తులసి మొక్కను పెంచే కుండీని పూల మొక్కల కుండీల్లో కలిపి పెంచరాదు.
పాలు కారే చెట్లు, ముళ్ల చెట్లు, గోరింట, జువ్వి, చింత, మర్రి, కుంకుడు, మునగ, నేరేడు, రేగు, జీడి మామిడి, పోక, అవిశ మొదలైన రకరకాల చెట్లని ఇంటికి కనీసం యాభై అడుగుల దూరంలో సెపరేట్ కాంపౌండ్ వాల్ కట్టి ఆ ప్రదేశంలోనే వీటిని పెంచాలి. అంటే ఇంటి వాస్తుకి ఈ మొక్కలు పెంచే ప్రదేశం వాస్తుకి సంబంధం లేకుండా వుండాలి. దాన్లోకి వెళ్లే గేటు కూడా ప్రత్యేకంగా వుండాలి. ఇలా చేయటం వలన ఇంట్లో నివశించేవారికి మేలు జరుగుతుంది.