శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2024 (20:42 IST)

ఐదేళ్లలో 10 సార్లు కరెంట్ బిల్లులు పెంచిన జగన్ 27 వేల కోట్లు దోపిడి: పవన్ కల్యాణ్

Pawan Kalyan- Chandrababu
ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి అధఃపాతాళానికి తొక్కేసారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కృష్ణాజిల్లా పెడనలో చంద్రబాబుతో కలిసి పవన్ ఉమ్మడి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 70 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన జగన్... నేను భీమవరం కాకుండా పిఠాపురం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నావని అడగటం చూస్తుంటే ఆయన తెలివి ఏమిటో అర్థమవుతుందని అన్నారు.
 
ఐదేళ్లలో పదిసార్లు కరెంటు బిల్లులు పెంచారు, కరెంట్ చార్జీలు పెంచి ఏకంగా రూ. 27 వేల కోట్లు దోపిడి చేసారని మండిపడ్డారు. ఇక్కడ ఓ జడ్జి తల్లి ఆస్తులను జోగి రమేష్ దోచుకు తిన్నారని ఆరోపించారు. రైతులకు పాస్ పుస్తకం కావాలన్నా, చేపలు చెరువులు తవ్వుకోవాలన్నా ఎమ్మెల్యేలకు ముడుపులు చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. చేనేతలు వున్న ఈ నియోజకవర్గంలో తాము అధికారంలోకి రాగానే కలంకారీ కార్మికుల కళకు బ్రాండింగ్ చేస్తామని అన్నారు.
 
జగన్ రెడ్డికి వెన్నులో వణుకుపుట్టేలా కూటమి అభ్యర్థులను అతి భారీ మెజారిటీతో గెలిపించాలని, ఏపీ అభివృద్ధికి ప్రజలు పాటుపడాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన జగన్ రాగానే సారాయి వ్యాపారిగా మారిపోయాడని ఎద్దేవా చేసారు. సొంత బ్రాండ్లు తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆటాడుకున్నారని అన్నారు. మద్యం ద్వారా చేసిన దోపిడీ సొమ్ముతో మళ్లీ ఓట్లను కొని గెలవాలని చూస్తున్నారనీ, ప్రజలు అప్రమత్తంగా వుండాలని పిలుపునిచ్చారు పవన్.