సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (16:07 IST)

పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊరట : జనసేనకే గాజు గ్లాసు గుర్తు!

glass tumbler
జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకే కేటాయిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు మంగళవారం ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. గాజు గ్లాసు కోసం తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా జనసేన పార్టీకి కేటాయించిందంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... తీర్పును రిజర్వు చేయగా, మంగళవారం తుది తీర్పును వెలువరించింది. 
 
గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌లో పెట్టింది. దీంతో ఈ గుర్తు జనసేన పార్టీకి కేటాయిస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ గుర్తు కోసం జనసేన, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలు న్యాయపోరాటానికి దిగాయి. తాజాగా ఏపీ హైకోర్టు తీర్పుతో గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి కేటాయిస్తూ ఉత్తర్వులు చేయనుంది. అలాగే, హైకోర్టు తీర్పుతో గాజు గ్లాసు గుర్తు తమ పార్టీకి దక్కడంపై జనసైనికులు, వీరమహిళలు సంతోషంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు.