బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (16:49 IST)

అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి.. దస్తగిరి పిటిషన్‌పై హైకోర్టు విచారణ!!

viveka deadbody
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితుల్లో ఒకరైన వైఎస్ అవినాశ్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఆ కేసులో అప్రూవర్‌గా మారిన మరో నిందితుడు దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అవినాశ్ రెడ్డి కోర్టు షరతులను ఉల్లంఘించారంటూ దస్తగిరి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా, అవినాశ్ రెడ్డి తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని ఆరోపించారు. తనకు రూ.20 కోట్లు ఆఫర్ చేసి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని దస్తగిరి వివరించారు. 
 
గురువారం విచారణ సందర్భంగా దస్తగిరి వాదనలను సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అంటూ సీబీఐ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు సీబీఐ తరపు న్యాయవాది స్పందిస్తూ దస్తగిరి వాదనలు సమర్థిస్తున్నట్టు చెప్పారు. అలాంటపుడు అవినాశ్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. 
 
అయితే, తమకంటే ముందే మృతుని కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సుప్రీంలో ఆమె పిటిషన్‌పై విచారణ సందర్భంగా తమ వాదనలు వినిపిస్తామని సీబీఐ విరణ ఇచ్చింది. దస్తగిరి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరుపుతున్నామని వెల్లడించింది. అటు, వివేకా హత్య కేసులో ఇతర నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, జి.ఉదయ్ కుమార్ రెడ్డిల బెయిల్ పిటిషన్లపై విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.