ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (09:55 IST)

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు తీర్పు

court
గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించే విషయంలో మంత్రి మండలి సిఫారసులను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని రాష్ట్ర హైకోర్టు తేల్చిచెప్పింది. పునఃపరిశీలన, సందేహాల నివృత్తి, అదనపు సమాచారం కోసం తిప్పి పంపే అధికారం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు.. బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌కుమార్‌, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తూ గవర్నర్‌ నిరుడు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం సిఫారసు మేరకు ప్రొఫెసర్‌ కోదండరాం, అమీర్‌ అలీలను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సైతం క్వాష్‌ చేసింది. ఈ వ్యవహారంపై రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరించి గవర్నర్‌ తాజా నిర్ణయం తీసుకుంటారని తాము నమ్ముతున్నట్టు పేర్కొంటూ గురువారం తుది తీర్పు వెలువరించింది. 
 
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 171(5) ప్రకారం దఖలుపడిన అధికారాలను మంత్రిమండలి సలహా ప్రకారమే గవర్నర్‌ వినియోగించాలని స్పష్టంచేసింది. ఆర్టికల్‌ 361 ప్రకారం గవర్నర్‌ ఏ కోర్టుకూ జవాబుదారీకాదని, గవర్నర్‌కు సానుకూలంగా ఎలాంటి ఆదేశాలివ్వడం సైతం సాధ్యం కాదని పేర్కొంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా.. దాసోజు, కుర్రాను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ నిరుడు జూలై 31వ తేదీన గవర్నర్‌కు మంత్రివర్గం సిఫారసు చేసింది. ఆ సిఫారసును సెప్టెంబరు 19న గవర్నర్‌ తిరస్కరించారు. దీంతో గవర్నర్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాసోజు, కుర్రా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 
 
ఇవి పెండింగ్‌లో కోదండరాం, అమీర్‌ అలీ నియామకాలను సైతం సవాల్‌ చేస్తూ వారు మధ్యంతర పిటిషన్లు వేశారు. వీటిపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌ ధర్మాసనం విచారణ నిర్వహించి, గత నెల 15న తీర్పును రిజర్వు చేసింది. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాదులు ఆదిత్య సోంధి, మయూర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ గవర్నర్‌ చర్యలు న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయన్నారు. ఆర్టికల్‌ 361 ప్రకారం గవర్నర్‌కు వ్యక్తిగత రక్షణలను రాజ్యాంగం కల్పించిందే తప్ప గవర్నర్‌ చర్యలను సమీక్షించరాదని దాని అర్థం కాదన్నారు. 
 
ఆర్టికల్‌ 200, ఆర్టికల్‌ 356 కింద గవర్నర్‌కు విస్తృతమైన విచక్షణాధికారాలు కట్టబెట్టిన రాజ్యాంగం.. ఆర్టికల్‌ 171 (5) కింద మాత్రం విచక్షణాధికారాలు ఇవ్వలేదన్నారు. మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాలన్నారు. పిటిషనర్లు ఇద్దరూ సామాజిక సేవలో విస్తృతంగా పాల్గొన్నారని, ఆర్టికల్‌ 171లో స్పెషల్‌ అచీవ్‌మెంట్స్‌ అంటూ ప్రత్యేకంగా ఏమీ పేర్కొనలేదని వాదించారు. గవర్నర్‌ జారీ చేసిన తిరస్కరణ ఆదేశాలు పిటిషనర్ల చట్టబద్ధమైన ఆకాంక్షలను దెబ్బతీసేలా, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. రిట్‌ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వం నూతన నియామకాలు చేపట్టడం సమంజసం కాదన్నారు.