జైలు నుంచి పరారయిన ఖైదీని చాకచక్యంగా పట్టుకున్న నగరి పోలీసులు
సత్యవేడు సబ్ జైలు నుండి పరారైన రిమాండ్ ఖైదీని నగరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నగరి సీఐ.మధ్దయ్యాచారి అందించిన వివరాల మేరకు నగరి పరిసర ప్రాంతాల్లో గత రెండేళ్లుగా నగరి, పల్లిపట్టు, తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో 40 కి పైగా పశువుల దొంగతనం జరిగింది. పశువుల దొంగలని పట్టుకోవడం కోసం పుత్తూరు సబ్ డివిజనల్ డీఎస్పీ, డాక్టర్. టీ.డీ.యశ్వంత్ ఆదేశాల మేరకు దాదాపు 25 కేసులలో సంబంధాలున్న పశువుల దొంగ సాయి(23)ని రెండు నెలల ముందు నగరి పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ చేసి సత్యవేడు సబ్ జైలుకు పంపారు.
సత్యవేడు జైలులో 20 రోజులు ముందు సత్యవేడు సబ్ జైల్ సిబ్బంది కళ్ళు గప్పి గోడ దూకి పరారై పోయాడు. 20 రోజులుగా సబ్ జైల్ సిబ్బంది, పోలీసులు ముద్దాయి సాయిని పట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నగరి సీఐ. మద్దయ్యచారి, తన టీంతో 4 రోజులుగా రెక్కీ నిర్వహించారు. పక్కా ప్లాన్ ప్రకారం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాల్లో పట్టుకున్నారు. విచారణలో పోలీసుల రెక్కిని గమనించిన ముద్దాయి సాయి 20 రోజులుగా ఎలాంటి ఆహారం లేకుండా కేవలం నీరు మాత్రం తాగుతూ అజ్ఞాతంలో ఉన్నాడన్న విషయం తెలుసుకుని నివ్వెరపోయారు. ఈ ఆపరేషన్లో సత్యవేడు సబ్ జైలు జైలర్ మస్తాన్, నగరి క్రైం బ్రాంచ్ సిబ్బంది గవాస్కర్ తదితరులు పాల్గొన్నారు.