నాపై కక్షగట్టారు.... హిందూ ధర్మాన్ని కాలరాస్తున్నారు: అశోక్ గజపతిరాజు
వైకాపా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాలరాస్తోందని తెదేపా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు విమర్శించారు. నెల్లిమర్ల మండలం రామతీర్థం వద్ద సంప్రదాయంగా జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమాన్ని వాళ్ల ఇష్టం వచ్చినట్లు చేశారని మండిపడ్డారు.
బోడికొండపై కోదండరాముడి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా నిన్న ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆలయ ఈవో ఫిర్యాదు చేయగా, నెల్లిమర్ల పోలీసులు అశోక్‌పై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. దేవాలయాల నిధులు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉన్నా, ప్రభుత్వం అనుసరించడం లేదని అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన తనపై కక్ష గట్టి కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
ట్రస్ట్‌ల ఆచారాలు, సంప్రదాయాలు అందరూ పాటించాలి. రామతీర్థంలో నిన్న జరిగిన ఘటన విచిత్రంగా ఉంది. శంకుస్థాపన కార్యక్రమంలో సంప్రదాయం పాటించకపోవడం చూసి బాధ కలిగింది. వైకాపా ప్రభుత్వానికి నాపై ప్రత్యేక దృష్టి ఉంది. ఆలయానికి వాడుతున్న రూ.3కోట్ల నిధులు ప్రభుత్వ ధనం కాదు. పూజా కార్యక్రమాలకు అడ్డు తగిలితే నాపై చర్యలు తీసుకోవచ్చు. హిందూ ధర్మ ప్రకారమే ఆలయాలకు విరాళాలు తీసుకుంటారు. ఆలయాల నిధులను ఈ ప్రభుత్వం ఇతర పనులకూ వాడుతోంది. మాన్సాస్ ట్రస్ట్ మాజీ ఛైర్మన్‌కు రూ.70వేలు అలవెన్స్ ఇచ్చారు అని అశోక్ గజపతిరాజు అన్నారు.