శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (08:21 IST)

ఆంధ్రప్రదేశ్ లో "108" సేవలు బంద్

సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో వున్న సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసనగా "108" సేవలు నిలిపేస్తున్నట్లు 108 కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు.

108 ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని, రెండు నెలలుగా ఉద్యోగులకు వేతనాలు కూడా సదరు సంస్థ బివిజి చెల్లించడంలేదని, గత ప్రభుత్వం నుంచి ఉన్న సమస్యలూ పరిష్కారం కాలేదని తెలిపారు. తమ సమస్యలపై వైద్యఆరోగ్య శాఖ మంత్రికి, ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చి నెలరోజులైనా పట్టించుకోలేదని పేర్కొన్నారు. 'స్పందన'లో విన్నవించి వారం రోజులు దాటినా తమకు సమాధానం రాలేదని పేర్కొన్నారు.

అసెంబ్లీలో 108 వాహనాలపై చర్చల్లోనూ ఉద్యోగుల విషయం ఎప్పుడూ ప్రస్తావించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపారు. తమకు జివికె యాజమాన్యం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాలని, 8 గంటల పని అమలుచేయాలని, 108 సేవలను ప్రభుత్వమే నిర్వహించి ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ పాలసీ అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేవరకు రాష్ట్రవ్యాప్తంగా సేవలు నిలిపివేస్తామని కిరణ్‌ స్పష్టం చేశారు.