శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 మే 2020 (16:56 IST)

లాక్ డౌన్ శాపం.. 4నెలల పసికందుకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి పేదల పాలిట శాపంగా మారింది. పొట్ట కూటి కోసం పక్క రాష్ట్రాలకు వలస పోయిన కార్మికులు లాక్ డౌన్‌తో నానా తంటాలు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు పనులు లేక స్వస్థలాలకు తరలివస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నారాయణ పేట జిల్లాలో నాలుగు నెలల పసికందుకు కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. 
 
రెండు రోజుల క్రితం ముంబై నుంచి జాక్లైర్‌కు వచ్చిన వలస కూలీ, అతని కుమారుడికి పరీక్షలు నిర్వహించగా బాలునికి కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్యం కోసం వారిని హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు.
 
మరోవైపు నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజుల క్రితం ముంబై నుంచి వలస వచ్చిన 60 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో అతనిని మూడు రోజుల క్రితం జిల్లా దవాఖానకు తరలించారు. 
 
అక్కడి నుంచి హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించగా మంగళవారం అతనికి పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చారు. ఇతనితో పాటు ముంబై నుంచి మరో ఐదుగురు ఒకే కారులో ప్రయాణం చేసి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. వారికి కూడా పరీక్షలు జరిపి పాజిటివ్ రాకుంటే హోం క్వారంటైన్ లో ఉంచుతామని అధికారులు తెలిపారు.