గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (13:09 IST)

సంక్రాంతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

సంక్రాంతి వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి అంతాఇంతా కాదు. ముఖ్యంగా, నగరాల నుంచి గ్రామాలకు వెళ్లే వారితో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయివుంటాయి. ముఖ్యంగా రైళ్లలో తీవ్రమైన రద్దీ నెలకొంటుంది. ఈ ప్రయాణికుల రద్దీని నివారించేందుకు ప్రభుత్వాలతో పాటు భారతీయ రైల్వే శాఖ సంక్రాంతి స్పెషల్ పేరుతో ప్రత్యేక బస్సులు, రైళ్లను నడపడం ఆనవాయితీగా వస్తుంది. 
 
ఈ యేడాది కూడా సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయినప్పటికీ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో మరో నాలుగు ప్రత్యేక రైళ్లను అదనంగా నడిపేందుకు సిద్ధమైంది. 
 
సంక్రాంతి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల12, 13 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపనుంది. ఇందులో భాగంగా, ఈ నెల 12వ తేదీన కాచిగూడ - కాకినాడ (82724), సికింద్రాబాద్ - విశాఖపట్టణం (82719) ప్రాంతాల మధ్య సువిధ ప్రత్యేక రైళ్లను నడుపనుంది. 
 
అలాగే, 13వ తేదీన కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ (07450), విశాఖపట్టణం - సికింద్రాబాద్ (07499) ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేలా చర్యలు తీసుకుంది. ఈ రైళ్లు తూర్పుగోదావరి జిల్లా మీదుగా ప్రవేశించినప్పటికీ రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో మాత్రం ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.