పారదర్శక బిడ్డింగ్ ద్వారా రూ.780 కోట్లు ఆదాయం
పారదర్శక బిడ్డింగ్ ద్వారా రూ.780 కోట్లు, నీటిపారుదలశాఖ ద్వారా రూ.830 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని మంత్రి అనిల్‌కుమార్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో అన్ని ప్రాజెక్టులు చేపట్టే దిశగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
నవంబర్ నుంచి పోలవరం పనులు మొదలు పెడతామని పేర్కొన్నారు.పారదర్శకంగా బిడ్డింగ్ కోసం చేపట్టిన కార్యక్రమంతో మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి అనిల్‌కుమార్ అన్నారు. పారదర్శక బిడ్డింగ్ ద్వారా రాష్ట్రానికి రూ.780 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
పోలవరం పనులు ఆగిపోవడం వల్ల నష్టం జరిగినట్లు విమర్శిస్తున్నారని... వరదల కారణంగా నవంబర్ వరకు పనులు చేయలేని పరిస్థితి అని మంత్రి వివరించారు. పారదర్శక బిడ్డింగ్‌పై ప్రశంసించడం పోయి విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో మ్యాక్స్ కంపెనీకి అధిక ధరలకు పనులు అప్పగించారని...ఇప్పుడు 12.6 శాతం తక్కువ ధరతో మ్యాక్స్ ముందుకు వస్తే సింగిల్ బిడ్డింగ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారని మంత్రి అన్నారు.
ఇద్దరు ఉంటే రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని.. పోలవరం రివర్స్ టెండరింగ్‌తో నష్టం జరుగుతుందని చెబుతున్నారని..నవంబర్ నుంచి పోలవరం పనులు మొదలు పెడతామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం డిజైన్ ప్రకారమే నిర్మాణం చేపడతామని తెలిపారు.
నీటిపారుదలశాఖకు సంబంధించి ప్రభుత్వ స్థలాన్ని రూ.వెయ్యికి లీజుకు తీసుకున్నారని... గతంలో చేసిన అక్రమాలు ఇప్పుడు బయటపడుతున్నాయని వెల్లడించారు. నీటిపారుదల శాఖ ద్వారా ప్రభుత్వానికి రూ.830 కోట్లు ఆదాయం వచ్చిందని...ఇదే స్ఫూర్తితో అన్ని ప్రాజెక్టులు చేపట్టే దిశగా ముందుకెళ్తామని తెలిపారు.