శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2019 (06:25 IST)

మోయలేని భారంగా నేటి చదువులు

ఆటపాటలతో ఉల్లాసంగా, మానసికంగా చదువుకోవాల్సిన పిల్లలు నేడు గంపెడు పుస్తకాలున్న బ్యాగులను వేసుకుని పాఠశాలకు వెళ్తున్నారు. స్కూల్ బ్యాగు బరువుపై కమిటీలు, రిపోర్టులు ఎన్ని ఉన్నా క్షేత్రస్థాయిలో నామమాత్రపు తనిఖీల్లో అవి ఉత్తర్వులుగానే మిగిలిపోయాయి.

పుస్తకాలు ఎంత ఎక్కువుంటే.. అంత బాగా చదువు చెప్తారన్న ధోరణిలో తల్లిదండ్రులుంటే.. తమ పాఠశాల పేరుతో ముద్రించిన బండెడు పుస్తకాలతో ప్రైవేటు యాజమాన్యాలు బాల్యంపై భారాన్ని పెంచుతున్నాయి. 'అబ్బా! బ్యాగు ఎంత బరువు' అని బాధ పడుతూనే భారం మోయక తప్పట్లేదు. కండరాల పైన ఒత్తిడి పడి.. పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది.

ఒత్తిడిలేని విద్యను ఆడుతూ పాడుతూ అభ్యసించాల్సిన విద్యార్థులు బడి సంచుల మోతతో వంగి పోతున్నారు. బ్యాగు భారం తగ్గించాలని 2006లో చట్టం వచ్చినా.. సరైన దిశగా అమలుకు నోచుకోక విద్యార్థులు పుస్తకాలను మోస్తూ కష్టపడుతున్నారు.

నిబంధనలు గాలికి.. బ్యాగుల బరువుపై కేంద్రం గతంలోనే యశ్​పాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నివేదిక ప్రకారం 2006లో స్కూల్ బ్యాగ్ చట్టాన్ని రూపొందించారు. కమిటీ సూచనల మేరకు ఏ విద్యార్థి బ్యాగు బరువు ఎంత ఉండాలనే నిర్దిష్టమైన ప్రణాళికను జారీ చేసింది. సీసీఈ మెథడ్ వచ్చాక పాఠశాల యాజమాన్యాలు ఈ సూచనలను గాలికొదిలేశాయి.

బ్యాగుల బరువుకు కారణమిదే.. ఏ తరగతి పిల్లలకైనా 6 సబ్జెక్టులుంటున్నాయి. ప్రతి సబ్జెక్టుకు టెక్ట్స్ బుక్, క్లాస్​వర్క్, హోంవర్క్ నోట్స్, అసైన్​మెంట్ నోట్స్​లు ఉండాలి. ఇలా ఒక్కో సబ్జెక్టుకు 4 పుస్తకాలు పెట్టేసరికి బ్యాగు బరువు అమాంతం పెరిగిపోయి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పిల్లల తల్లిదండ్రుల వైఖరి కూడా వింతగా ఉంటుంది.

ఎక్కువ పుస్తకాలు ఇచ్చే పాఠశాలలోనే విద్య బాగా చెప్తారని భావిస్తున్నారు. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు పుస్తకాలు తగ్గకూడదనే ధోరణిలో ఉన్న తల్లిదండ్రులు ఆలోచనలే చికాకుగా మారుతున్నాయి. విద్యార్థులపై వ్యాధుల పంజా... శరీరానికి మించిన బరువు మోస్తున్నందున చిన్నారుల్లో శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి.

బరువు అధికంగా ఉండి ఎముకలు, కండరాల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. శారీరక ఎదుగుదల తగ్గి, వెన్నునొప్పి చిన్నతనంలోనే మొదలవుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ పిల్లల బ్యాగులపై నిబంధనలను అమలు చేస్తున్నారు.

ప్రతి శనివారం నో బ్యాగ్ డే ను పాటించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయగా విద్యార్థులకు బ్యాగుల మోత నుంచి కొంత ఉపశమనం కలిగింది.