సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 20 ఫిబ్రవరి 2021 (23:13 IST)

ఓటర్ లిస్టులో సినీ నటుడు వెంకటేష్ ఫోటో

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు హడావిడి ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే మూడు దశల ఎన్నికల పోలింగ్ పూర్తవగా, చివరి విడత పోలింగ్‌ కోసం అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. ఓట్ల విషయంలో తాజాగా, చిన్న పొరపాటు దొర్లింది. కర్నూలు జిల్లా కల్లూరు పరిధిలో ఓటరు జాబితాలో ప్రముఖ సినీ హీరో వెంకటేష్ ఫొటో ఉండటం కలకలం రేపింది. 
 
జిల్లాలోని కల్లూరు 31వ వార్డు ఓటరు జాబితాలో వెంకటేష్‌ ఫొటో కనిపించింది. అయితే వివరాలు మాత్రం ఓ మహిళకు సంబంధించినవి ఉన్నాయి. దీంతో, ఓటర్ లిస్టులో వెంకటేష్ ఫొటో ఉండటంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.వీరపాండియన్ సీరియస్ అయ్యారు. అధికారులకు కలెక్టర్ ఊహించని షాకిచ్చారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కర్నూలు ఆర్డీవో, కల్లూరు తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
 
అలాగే 31 వార్డు ఓటరు లిస్టు ఇంచార్జ్ బీఎల్‌వోపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని, వెంటనే తప్పును సరిదిద్దాలని శుక్రవారం కర్నూలు ఆర్డీఓ వెంకటేష్‌, కల్లూరు తహసీల్దార్‌ను కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు.