బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 26 అక్టోబరు 2018 (22:25 IST)

నేను చనిపోతున్నా... మా ఆయనకు ఆయన ప్రియురాలినిచ్చి పెళ్లి చేయండి...

‘‘నా భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీనికి ఆమె తల్లిదండ్రులు, సోదరుడు సహకరిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా జీవితాన్ని వీళ్లంతా సర్వనాశనం చేసేశారు. నా కొడుకును ఒంటరిగా వదిలి చనిపోతున్నాను. నా భర్తకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి ఇకపై ఎవరి కాపురాల్ని కూల్చకుండా ఉంటుంది. రెండేళ్లలో ఆమె పరిస్థితి కూడా నాలాగే తయారవుతుంది.’’ ఇలా సూసైడ్‌ నోట్‌ రాసి తనువు చాలించిందో వివాహిత. 
 
తణుకు పట్టణంలోని పాలంగిలో నివాసముంటున్న కాళిశెట్టి అనంతలక్ష్మి (29) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కాళిశెట్టి శివకుమార్‌ ఎస్‌బీఐలో ఉద్యోగి. వీరికి మూడేళ్ల షన్వీర్‌ ఉన్నాడు. వీరు  2015 ఏప్రిల్‌ 22న ద్వారకా తిరుమలలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కులాంతర వివాహం కావడంతో పెద్దలకు ఇష్టం లేకపోయినా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 
 
అనంతలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియడంతో పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గురువారం ఉదయం కొవ్వూరు డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు కూడా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
 
పట్టణంలోని ఎస్బీఐలో పని చేస్తున్న శివకుమార్‌ ఆచంట మండలం కొడమంచిలి గ్రామానికి చెందిన తమ్మిన సత్యనారాయణ, నాగమణి దంపతుల కుమార్తె అనంతలక్ష్మిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అప్పటికే శివకుమార్‌కు రాజమండ్రికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. 
 
ఈమె తండ్రి ఏఎస్సై కావడంతోపాటు ఆమెకు సహకరిస్తుండటంతో ఆమె సోదరుడు సైతం తనను బెదిరిస్తున్నాడని అనంతలక్ష్మి రాసిన లేఖలో పేర్కొంది. ఈ క్రమంలో పెళ్లి అయిన నాటి నుంచి శివకుమార్, అనంతలక్ష్మి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం తిరుపతి వెళుతున్నానని చెప్పి శివకుమార్‌ ప్రియురాలితో ఎక్కడికో వెళ్లాడని తెలుసుకుని అతనితో అనంతలక్ష్మి ఫోన్‌లో ఘర్షణ పడింది. శివకుమార్‌ తల్లి సుబ్బలక్ష్మి వద్దకు వెళ్లిన అనంతలక్ష్మి తన కుమారుడు షన్వీర్‌ను దించి వెళ్లింది. 
 
సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో ఆమెకు ఫోన్‌ చేశారు. ఫోన్‌ తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా లోపల ఫ్యాన్‌కు ఉరి వేసుకుని అనంతలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. అయితే తన అల్లుడు శివకుమార్, ఆయన ప్రియురాలు, తల్లిదండ్రులు తన కుమార్తె మృతికి కారణమంటూ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు ఆద్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.