ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

లోన్‌ యాప్‌ల వ్యవహారం... కొడుకుని పోలీసులకు పట్టించిన తండ్రి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లోన్‌ యాప్‌ల కేసులో ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. తన కుమారుడు లక్షలాదిమందిని మోసం చేసినట్టు తెలుసుకున్న ఓ పోలీసు అధికారి అతడిని సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టించాడు. 
 
లోన్‌ యాప్‌ల కేసులో రెండు రోజుల క్రితం చైనా దేశీయుడు ల్యాంబో, కర్నూలు జిల్లా వాసి నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు..  ల్యాంబో తరఫున ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో లోన్‌ యాప్‌ వ్యవహారాలను చూసుకునేవాడు. ఈ క్రమంలో నాగరాజు తన సోదరుడిని కూడా రుణ యాప్‌ల సంస్థలో చేర్పించాడు.
 
అయితే నాగరాజు తండ్రి కర్నూలు జిల్లాలో ఏఎస్‌గా పనిచేస్తున్నారు. కొన్ని రోజులుగా నాగరాజు వ్యవహారాన్ని గ్రహించారు. అతనిపై అనుమానంతో అసలు విషయాలు తెలుసుకోవడం ప్రారంభించారు. దీంతో నాగరాజును ఢిల్లీ నుంచి ఇంటికి రప్పించారు. 
 
అనంతరం హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేంతవరకు నాగరాజును ఇంట్లోనే ఉండేలా చేసి పోలీసులకు పట్టించారు. అయితే తన వివరాలు బహిర్గతం చేయకూడదని ఆ ఎస్‌ఎస్‌ఐ.. సైబర్‌క్రైం అధికారులను కోరారు. 
 
బంధం కంటే బాధ్యత గొప్పదని భావించి కన్న కుమారులనే పోలీసులకు పట్టించిన ఏఎస్సైపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా, తన కుమారుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆయన తన పేరు, వివరాలను బయటపెట్టవద్దని సైబర్ క్రైం పోలీసులను కోరారు.