శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 31 డిశెంబరు 2020 (11:32 IST)

సోనల్ శర్మ: పేడ ఎత్తే అమ్మాయి ఇక న్యాయమూర్తి

‘‘నా తండ్రి ఊరందరి చేతిలో తిట్లు తినడం చూశాను. వీధుల్లో చెత్త ఏరుకోవడం చూశాను. మేం పిల్లలందరం బాగా చదువుకోవడం కోసం ఆయన ఎన్ని అవమానాలు సహించారో నాకు తెలుసు. స్కూలుకు వెళ్లే రోజుల్లో మా నాన్న పాలు అమ్ముకుంటారని చెప్పడానికి సిగ్గుపడేదాన్ని. కానీ ఈరోజు ఈ కుటుంబంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను."

 
ఇవి గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు. బాధ, అవమానంనుంచీ సంతోషం, ఆత్మాభిమానం దిశగా సాగిన ఒక విజయ యాత్ర. రాజస్థాన్‌లో సరస్సుల నగరంగా పేరొందిన ఉదయపూర్‌కు చెందిన సోనల్ శర్మ కథ ఇది. తెల్లవారకముందే పేడ ఎత్తడంతో ప్రారంభమవుతుంది 26 ఏళ్ల సోనల్‌ దినచర్య. నాలుగో తరగతి నుంచి ఇప్పటివరకూ ఇదే దినచర్య కొనసాగింది. అయితే, ఈ పరిస్థితులు మారే కాలం ఎంతో దూరంలో లేదు. అతి త్వరలో సోనల్ న్యాయస్థానంలో తీర్పులు చెబుతూ తన దినచర్య ప్రారంభించబోతున్నారు.

 
2018లో సోనల్ శర్మ రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీసెస్‌ (ఆర్‌జేఎస్)కు సెలక్ట్ అయ్యారు. ఈ పరీక్షా ఫలితాలు గత ఏడాదే వచ్చాయి కానీ సోనల్‌కు ఒక్క మార్క్ తక్కువ రావడంతో వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచారు. ఇప్పుడు ఆమెను సెలక్ట్ చేశారు. డిసెంబర్ 29న ఆమె ధ్రువపత్రాల తనిఖీ కూడా పూర్తయింది. 2017లో సోనల్ మొదటిసారి ఆర్‌జేఎస్ రిక్రూట్మెంట్ పరీక్షలు రాశారు. కానీ మూడు మార్కుల తేడాతో ఉద్యోగాన్ని అందుకోలేకపోయారు. 2018లో మరో ప్రయత్నం చేశారు. ఈసారి ఒక్క మార్కు తక్కువ వచ్చి వెయిటింగ్ లిస్ట్‌లో చేరారు. చిత్తశుద్ధితో కృషి చేసేవారిని విజయం తప్పక వరిస్తుందని చెబుతుంటారు. సోనాల్ విషయంలో అదే నిజమైంది.

 
సరిగ్గా ఏడాది తరువాత అంటే కిందటి నెల నవంబర్‌లో వెయిటింగ్ లిస్ట్‌ నుంచి ఆమెను జడ్జి ఉద్యోగానికి సెలక్ట్ చేసినట్లు తెలిసింది. తరువాత వెంటవెంటనే డాక్యుమెంట్ల వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ జరిగిపోయాయి. ఒక సంవత్సరం ట్రైనింగ్ తరువాత ఆమె జడ్జిగా సేవలు ప్రారంభిస్తారు.

 
తండ్రి అవమానాలు భరించడం చూసి...
"నేను అప్పుడు నాలుగో తరగతి చదువుతున్నాను. అందరు పిల్లల్లాగే నాకు కూడా నాన్నతో బయటికెళ్లడం సరదాగా ఉండేది. మా నాన్న ఇంటింటికీ తిరిగి పాలు పోసేవారు. ఏ ఇంటికి వెళ్లినా ఏదో ఒక వంక పెట్టి అందరూ నాన్నను తిడుతుండేవారు. అన్ని అవమానాలు భరిస్తూ కూడా నాన్న వాళ్లకు చిరునవ్వుతో జవాబు చెప్పేవారు. ఒకరోజు నాన్నతో పాలు అమ్మడానికి బయటికెళ్లి వచ్చిన తరువాత... నేనింక నాన్నతో బయటకి వెళ్లను, నాకు సిగ్గుగా ఉంది అని అమ్మతో చెప్పాను.

 
సిగ్గు ఎందుకంటే మావల్లే మా నాన్న అన్ని అవమానాలు భరిస్తున్నారు కాబట్టి. మమ్మల్ని చదివించడానికే నాన్న అంత కష్టపడుతున్నారు. కానీ ఈరోజు ఆయన తపస్సు ఫలించింది. అన్ని కష్టాల్లో కూడా నవ్వుతూ పోరాడుతూ ముందుకు సాగిన నాన్నను చూసాకే నాకు మరింత పట్టుదల వచ్చింది" అని సోనల్ తెలిపారు.

 
ఎప్పుడూ చదువులో ముందే ఉన్నారు
సోనాల్ ఉదయ్‌పూర్‌లోనే స్కూలు, కాలేజీ విద్యాభ్యాసం పూర్తిచేశారు. మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం నుంచీ న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఆ సమయంలో ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముతూనే యూనివర్సిటీలో చదువు కొనసాగించారు. పది పన్నెండు తరగతుల్లో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు.

 
మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయంనుంచీ బీఏ ఎల్ఎల్‌బీ (ఐదు సంవత్సరాలు)లో బంగారు పతకం అందుకోవడమే కాకుండా భామాషా అవార్డ్ కూడా అందుకున్నారు. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచినందుకు ఆమెకు ఛాన్సలర్ అవార్డ్ కూడా లభించింది.

 
నేను నానా కష్టాలు పడ్డాను కానీ నా పిల్లలు అన్ని కష్టాలు పడకూడదు
ప్రతి తల్లి, తండ్రీ తమ బిడ్డ తమకన్నా ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తారు. సోనల్ తండ్రి ఖ్యాలీ లాల్ శర్మ కూడా అదే ఆశించారు. ఇల్లు గడవడానికి, పిల్లలను చదివించడానికి ఖ్యాలీ లాల్‌కు ఉన్న ఆధారం పాడిపశువులు మాత్రమే. పాలు అమ్ముకుంటూ ఆయన తన పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. అనేకమార్లు సోనల్ కాలేజీ ఫీజు కట్టడానికి ఖ్యాలీ లాల్ దగ్గర డబ్బు ఉండేది కాదు.

 
"నా స్నేహితురాలి తండ్రి దగ్గరే అప్పు చేసి నాన్న నా కాలేజీ ఫీజు కట్టారు" అని సోనల్ చెప్పారు. 1980లలో ఖ్యాలీ లాల్ మహారాణా ప్రతాప్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఏడు పైసలకు పేడను అమ్మేవారు. అక్కడి సోలార్ ఎనర్జీ సెంటర్‌ కోసం పేడ అవసరమయ్యేది. సోనల్ తల్లి పేడతో పిడకలు చేసి అమ్ముతూ భర్తకు చేదోడువాడోడుగా ఉండేవారు. "నేను భరించిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు నా పిల్లలకు రాకూడదు" అని ఖ్యాలీ లాల్ శర్మ అన్నారు.

 
సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారు..
చాలామంది ఇళ్లల్లో పొద్దున్నే లేవగానే కాఫీ లేదా టీ తాగుతారు. తెల్లారేసరికి వారందరికీ పాలు పొయ్యడం కోసం ఖ్యాలీ లాల్ శర్మ కుటుంబం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేది. సోనల్ కూడా తెల్లారి నాలుగింటికే నిద్ర లేవాల్సి వచ్చేది. "నాన్న ఆవు, గేదెల పాలు పితికి ఇచ్చేవారు. మేము ఇంటింటికీ తిరిగి పాలు పోసేవాళ్లం" అని సోనల్ తెలిపారు.

 
"పేడ ఎత్తడం, పశువుల కొట్టం శుభ్రం చెయ్యడం, వాటికి మేత వెయ్యడం..ఈ పనులన్నీ మేమంతా కలిసి చేసేవాళ్లం. పొద్దున్న ఎనిమిది వరకూ పాడి పని చేసేవాళ్లం. తరువాత చదువుకునేవాళ్లం. మళ్లీ సాయంత్రం పాలు పితకడం, ఇళ్లకు పంచడం, పశువులకు మేత పెట్టడంలాంటి పనులన్నీ ఉంటాయి. మాకు ఇదే రొటీన్. దీన్ని మేము వదిలి పెట్టలేం. ఎందుకంటే ఇది మా కుటుంబ వ్యాపారం..ఇదే మాకు అన్నం పెట్టింది.

 
ఇంతకుముందు మా దగ్గర డబ్బులు ఉండేవి కావు కానీ ఇప్పుడు ఈ పనులన్నీ చెయ్యడానికి తప్పకుండా మనుషులను పెట్టుకుంటాం" అని సోనల్ చెప్పారు. జడ్జి కావాలన్న కూతురి కలలు సాకారం కావడంతో ఖ్యాలీ లాల్ శర్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ.. "తీర్పు చెప్పడంలో ఎప్పుడూ ఒత్తిడికి లొంగిపోవద్దు. అవతలివారు ఎవరైనా సరే న్యాయమే గెలవాలి. తప్పు చేసినవారికి శిక్ష పడాలి" అని తన కూతురికి చెప్పారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని సోనల్ శర్మ రుజువు చేశారు.