ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2019 (09:21 IST)

జగన్ అల్టిమేటం... వైకాపాకు దగ్గుబాటి రాజీనామా?

భార్యాభర్తలు చెరొక పార్టీలో ఉండటం కుదరదనీ, ఒకే పార్టీలో ఉండాలంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అల్టిమేటంతో వైకాపా నేత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఓ నిర్ణయానికి వచ్చారు. వైకాపాకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
 
ఇదే అంశంపై చర్చించేందుకు ఆయన శనివారం పర్చూరులో తన అనుచరులతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఇపుడు ఇదే చర్చనీయాంశమైంది. దగ్గుబాటితో పాటు ఆయన కుమారుడు హితేశ్ చెంచురామ్ కూడా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నేడో, రేపో లేఖను పంపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
 
కాగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి పురంధేశ్వరి, బీజేపీలో కొనసాగుతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్, ఉంటే ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలని దగ్గుబాటిని హెచ్చరించినట్టు కూడా వార్తలు వచ్చాయి. 
 
ఇదే సమయంలో పర్చూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌గా దగ్గుబాటిని, ఆయన కుమారుడిని కాదని రామనాథం బాబును ఎంపిక చేయడం ఆయన అనుచరుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో శనివారం నాడు దగ్గుబాటి తన అనుచరులతో సమావేశం కాగా, వైసీపీ అధిష్టానం వైఖరిపై నిరసన వ్యక్తమైంది. తమ నేతను అవమానించారని దగ్గుబాటి అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.