ఏపీ అవతరణ దినోత్సవం.. శరవేగంగా జగన్ సర్కారు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్‌లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యకార్యదర్శి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1న నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలిసారి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోనుంది. గత ఐదేళ్లూ చంద్రబాబు హయాంలో ఏపీ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేదు. జూన్ 2న తెలంగాణలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతుండగా, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆ రోజును ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి రోజుగా అభివర్ణించారు. నవనిర్మాణ దీక్ష పేరిట దీక్షలు నిర్వహించేవారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడంతో పరిస్థితి మారింది.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరపాలో తెలపాలని చంద్రబాబు హయాంలో అధికారులు కేంద్ర హోం శాఖను కోరారు.
దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ఒరిజనల్ బ్రాండ్ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. దీంతో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.