సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (10:57 IST)

పంచాయతీ ఎన్నికల ఫలితాలు: ఫ్యాన్‌దే హవా.. 90 శాతం మేర వైకాపాదే గెలుపు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయఢంకా మోగించారు. తొలి విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల వెలువడిన ఫలితాల్లో అధిక స్థానాల్లో గెలుపొందారు. పార్టీ రహితంగా ఈ ఎన్నికలు జరుగుతుండగా.. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు అధికారులు. 
 
అత్యధిక గ్రామాల్లో అధికార వైఎస్సార్‌‌సీపీ మద్దతుదారులు దాదాపు 82 శాతం స్థానాల్లో విజయం సాధించారు. మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీ కంచుకోటలుగా గ్రామాల్లో సైతం వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయఢంకా మోగించారు. 
 
తొలి విడత ఎన్నికల ప్రక్రియలో ఏకగ్రీవాలు మొదలు పోలింగ్‌ జరిగిన చోట ఫలితాల్లోనూ 82 శాతం మేర స్థానాలు వైఎస్సార్‌సీపీ అభిమానులే గెలుచుకున్నారు. తొలి విడత 3,249 గ్రామాల్లో ఎన్నికలు జరిగితే, 525 సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అందులో 98 శాతం మేర అంటే 518 సర్పంచ్‌ పదవులు వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలిచినవే కావడం విశేషం. 2,723 గ్రామ సర్పించి పదవులకు ఎన్నికలు జరిగితే అందులో 90 శాతం మేర వైఎస్సార్‌సీపీ అభిమానులే విజయం సాధించారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
 
ఇకపోతే.. రాష్ట్ర సర్కార్ అడ్డంకులు, కోర్టులు చిక్కులు అధిగమిస్తూ.. ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులతో పాటు ఆయా గ్రామాల్లోని 32,502 వార్డు పదవులకు జనవరి 23వ తేదీ గ్రామ పంచాయతీల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయగా.. ఏకగ్రీవాలుగా ముగిసినవి పోను మంగళవారం 2,723 సర్పంచ్‌ స్థానాలకు, 20,157 వార్డు పదవులకు పొలింగ్‌ జరిగింది.
 
గ్రామాల్లో పోలింగ్‌ ముగిసిన గంట వ్యవధి లోపే అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.30 గంటలకు పోలింగ్‌ ముగియగా, ఆ వెంటనే గ్రామ పంచాయతీల వారీగా వాటి పరిధిలో ఉండే పోలింగ్‌ కేంద్రాల నుంచి బ్యాలెట్‌ బాక్స్‌లను నిర్ణీత కౌంటింగ్‌ కేంద్రం వద్దకు తరలించి ఓట్ల లెక్కింపు చేపట్టారు. చిన్న గ్రామ పంచాయతీల్లోని కొన్నింటిలో సాయంత్రం ఐదు గంటలకు ఫలితాలు వెల్లడయ్యాయి. మంగళవారం అర్థరాత్రి వరకు ఓట్లలెక్కింపు కొనసాగింది. సర్పంచ్‌ ఫలితం ఖరారు కాగానే, ఆయా గ్రామాల్లో ఉప సర్పంచ్‌ను ఎన్నుకున్నారు.