శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (10:44 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ : ఎంపీలకు వెల్లడించిన సీఎం చంద్రబాబు

high speed train
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త చెప్పింది. బెంగుళూరు, చెన్నై, అమరావతి, హైదరాబాద్ నగరాలను కలుపుతూ బుల్లెట్ రైలును కేంద్రం ప్రతిపాదించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎంపీలకు సీఎం బాబు చెప్పారు. 
 
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు... సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వివిధ విషయాలపై చర్చించారు. ఆ తర్వాత సీఎం బాబు ఢిల్లీలో అందుబాటులో ఉన్న కూటమి ఎంపీలతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు మార్గాల్లో ఈ హై స్పీడ్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. మొదటి దశ ప్రతిపాదనల్లో ఆంధ్రప్రదేశ్ లేదన్నారు. 
 
కానీ, తాజాగా ఏపీని కూడా ఇందులో చేర్చినట్లు సీఎం... ఎంపీలకు తెలిపారు. దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అమరావతి నగరాలు కలి సేలా బుల్లెట్ రైళ్లు నడపడానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయని ఆయన చెప్పారు. పూర్తి ప్రతిపాదనలు సిద్ధమైన తర్వాత రైల్వే శాఖ వివరాలు వెల్లడిస్తుందని తెలిపారు. ఇక, రూ.60 వేల కోట్ల పెట్టుబడితో భారీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్న భారత్ పెట్రోలియం
కంపెనీ.. రామాయపట్నంపై మొగ్గు చూపుతుందని సీఎం తెలిపారు. 
 
ఈ రిఫైనరీ ఏర్పాటుకు మచిలీపట్నం పోర్టు ప్రాంతాన్ని ఎంపిక చేసే అవకాశాలు పరిశీలించాలని జనసేన పార్టీకి చెందిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఈ సమావేశంలో ముఖ్యమంత్రిని కోరారు. బీపీసీఎల్ తనకు నచ్చిన ప్రాంతాన్ని తాను ఎంపిక చేసుకొంటుందని, ఎక్కడ పెట్టాలన్నది ఆ కంపెనీ ఇష్టమేనని చంద్రబాబు ఆయనకు చెప్పారు. విశాఖ ప్రాంతంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు రాబోతోందని చంద్రబాబు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు వస్తోందని, దేశంలోనే ఇది అతి పెద్ద ప్రాజెక్టని ఆయన వెల్లడించారు.