గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 అక్టోబరు 2024 (17:09 IST)

డ్రోన్ల ద్వారా అత్యవసర మందుల చేరవేత : ఏపీ సర్కారు సన్నాహాలు

generic medicine
అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ మందులను డ్రోన్ల ద్వారా చేరవేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఇటీవల విజయవాడ నగరంలో సంభవించిన వరదల కారణంగా పలు ప్రాంతాల వాసులు అనేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితిని ఎదుర్కొన్నారు. సహాయక బృందాల వారు కూడా అక్కడికి చేరుకోలేక నిస్సహాయంగా మిగిలిపోయారు.
 
అలాంటి సమయాల్లో ప్రభుత్వం డ్రోన్ల ద్వారా బాధితులకు సాయం అందించింది. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలోనే కాదు అత్యవసర పరిస్థితుల్లోనూ డ్రోన్ల సాయం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎమర్జెన్సీ మందుల చేరవేతకు డ్రోన్లను వాడేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు నిర్వహించింది.
 
జిల్లాలోని కొల్లిపర మండలంలోని మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి అన్నవరపులంక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి మందులను చేర్చేందుకు అధికారులు డ్రోన్‌ను ఉపయోగించారు. 10 కిలోల టీకాలు, మందుల కిట్‌ను పంపించారు.
 
ఈ రెండు ఆరోగ్య కేంద్రాల మధ్య 15 కిలోమీటర్ల దూరం ఉంది. రేపల్లె కాలువ, కృష్ణా నది పరివాహక ప్రాంతాలను దాటుకుంటూ డ్రోన్ కేవలం 10 నిమిషాలలో అన్నవరపులంక ఆరోగ్య కేంద్రానికి చేరుకుంది. పీహెచ్‌సీ వైద్యాధికారిణి సీహెచ్ లక్ష్మీసుధ, తహసీల్దార్ సిద్ధార్థ, ఎంపీడీవో విజయలక్ష్మి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.